బొత్సకు లోకల్ ప్రెజర్.. ఫ్యామిలీ ప్యాకేజీ గట్టెక్కేనా..?

0
10

ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న బొత్స సత్యనారాయణ కుటుంబం, ఈసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను తమకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కోలుకుని, జిల్లాపై మళ్లీ పట్టు సాధించడంతో పాటు తమ కుటుంబ వారసులను రాజకీయంగా నిలబెట్టాల్సిన భారీ బాధ్యత బొత్స భుజాలపై పడింది. ఒకే కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులను జెడ్పీటీసీ బరిలోకి దించడం ద్వారా బొత్స ఫ్యామిలీ జిల్లాలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే, అధికార కూటమి గట్టి వ్యూహాలతో ఎదురుదాడికి దిగుతుండటంతో బొత్స తీవ్ర ఒత్తిడిలోకి నెట్టబడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బొత్స సత్యనారాయణ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెను బొండపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కేవలం కుమార్తె మాత్రమే కాకుండా, గరివిడి నుంచి తన కోడలు బొత్స పూజితను, గుర్ల నుంచి తన సోదరి లక్ష్మిని జెడ్పీటీసీ అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకోవాల్సిన అగ్నిపరీక్షను ఆయన ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మొత్తం 27 జెడ్పీటీసీ, 449 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను సమన్వయం చేస్తూ, ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న బొత్స.. తన కుటుంబ సభ్యుల విజయం కోసం సోషల్ మీడియా ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

టీడీపీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్న మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, కూటమి శ్రేణులు ఇస్తున్న గట్టి పోటీ, బొత్సపై ఒత్తిడిని మరింత పెంచింది. దీనికి తోడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ వేసిన బొత్స సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురికావడం బొత్స కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉందంటూ జనసేన అభ్యర్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు చైతన్య నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఈ మొదటి వికెట్ పడటంతో బొత్స క్యాంప్‌లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దీనిపై కలెక్టర్‌కు అప్పీల్ చేసినప్పటికీ, కూతురు అనూషతో పాటు మిగిలిన కుటుంబ సభ్యుల స్థానాలను సురక్షితంగా గట్టెక్కించడం కోసం బొత్స సత్యనారాయణ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన పొలిటికల్ ప్రెజర్‌ను ఫేస్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.