లారెన్స్ అసలు టార్గెట్ ఆమిర్ ఖానేనా..?

0
10

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల కేసులో ముంబై పోలీసుల దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌ను మట్టుబెట్టడానికే ఆ ముఠా ముంబైలో పక్కా స్కెచ్ వేసిందని పోలీసులు గుర్తించారు. మొదట సల్మాన్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించినప్పటికీ, అక్కడ ఉన్న అత్యంత కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ ప్లాన్ విరమించుకుని ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లను తమ తదుపరి లక్ష్యాలుగా మార్చుకున్నట్లు షూటర్లు విచారణలో అంగీకరించారు.

ఆమిర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ ముఠా ఆపరేటివ్‌లు బాంద్రాలోని ఆయన నివాసం పరిసరాల్లో దాదాపు ఒక నెల రోజుల పాటు తిష్ట వేశారు. ఈ కాలంలో మూడు వేర్వేరు సందర్భాల్లో ఆమిర్ ఖాన్ కదలికలపై అత్యంత రహస్యంగా రెక్కీ నిర్వహించారు. అయితే, ఆమిర్ ఖాన్ తరచూ సినిమా షూటింగ్‌ల నిమిత్తం ముంబై వెలుపల ఉండటం, ఒకవేళ నగరంలో ఉన్నా చాలా రోజుల పాటు ఇంటికే పరిమితం కావడం వల్ల షూటర్లకు ఆయన దొరకలేదు. ఆయనకున్న ఈ జీవన శైలి, ఎవరికీ అంత సులభంగా అందుబాటులో లేకపోవడమే చివరికి ఆయన ప్రాణాలను కాపాడాయని పోలీసు వర్గాలు వెల్లడించారు.

ఆమిర్ ఖాన్ వంటి అగ్ర నటులపై భారీ సెక్యూరిటీ కారణంగా దాడులు చేయడం కష్టం కావడంతో, బిష్ణోయ్ ముఠా తమ ప్లాన్‌ను మార్చుకుని టైగర్ ష్రాఫ్‌ను సులభమైన టార్గెట్‌గా ఎంచుకుంది. జుహులోని పుష్ప నర్సీ గ్రౌండ్‌కు టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ ఆడటానికి వస్తాడనే విషయాన్ని సోషల్ మీడియా రీల్స్ ద్వారా తెలుసుకున్న షూటర్లు, అక్టోబర్ 18న ఆయన కారుపై ఐదారు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీని భయభ్రాంతులకు గురిచేసేందుకే అమెరికా నుంచి అనిల్ పండిట్ నేతృత్వంలో ఈ కుట్ర జరిగిందని నిర్ధారించిన పోలీసులు, ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల నుంచి 11 మంది నిందితులను అరెస్ట్ చేసి నటుల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.