ఏపీలో పాక్ టీం.. అసలేం జరుగుతోంది..?

0
3

భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన, సున్నితమైన రహస్యాలను సరిహద్దులు దాటించి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ చేతుల్లో పెడుతున్న ఒక భారీ అంతర్రాష్ట్ర గూఢచర్య ముఠాను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం విజయవంతంగా బట్టబయలు చేసింది. విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా, అక్టోబర్ 1వ తేదీన అత్యంత రహస్యంగా ‘ఆపరేషన్ ఫైర్‌వాల్ – 2026’ పేరుతో ఒక మెగా ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఈ ఆపరేషన్ కింద సీఐ సెల్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు సహా మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు జరిపి ఈ ముఠా గుట్టురట్టు చేశాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రస్తుతం 18 మంది కీలక అనుమానితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ పక్కా నిఘా నీడలో ఉంచగా, వారిలో 13 మంది భారత నావికాదళం సిబ్బంది కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

వీరి ప్రమేయంపై లోతుగా దర్యాప్తు జరిపిన భద్రతా బలగాలు ఇప్పటివరకు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి విశాఖపట్నం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అరెస్టయిన వారిలో విశాఖపట్నం నావల్ బేస్‌లో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్, తమిళనాడులోని కోయంబత్తూరులో పట్టుబడిన నావల్ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీలు ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, ఉపా చట్టం, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద తీవ్రమైన కేసులు నమోదు చేశారు.

పాకిస్థాన్ గూఢచారులు భారత నావికాదళ సిబ్బందిని బురిడీ కొట్టించడానికి సోషల్ మీడియాలో నకిలీ మహిళా ప్రొఫైళ్లను సృష్టించి ‘హనీ ట్రాప్’ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై, ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్‌లలోకి దించి, భారత మొబైల్ నంబర్ల ఓటీపీల ద్వారా విదేశాల నుండి వాట్సాప్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్, యుద్ధనౌకల కదలికలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిషిద్ధ సమాచారాన్ని దొంగిలించి విదేశీ హ్యాండ్లర్లకు చేరవేసినందుకు నిందితులకు క్రిప్టో కరెన్సీ రూపంలో, స్థానిక వ్యాపారుల ద్వారా హవాలా మార్గంలో భారీగా నిధులు అందినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఆధారాలను సేకరించింది. దేశ రక్షణ వ్యవస్థలకు ముప్పుగా మారిన ఈ నెట్‌వర్క్‌ను ఏపీ పోలీసులు, నేవీ అధికారులు, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా తిప్పికొట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.