భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జియో ప్లాట్ఫార్మ్స్ ఐపీఓ (Jio Platforms IPO) లిస్టింగ్ వేడుక దేశ రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మక ఈవెంట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చిన్న కుమారుడు అనంత్ అంబానీ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మాటలకు ముఖేష్ అంబానీ కళ్లెంబడి నీళ్లు తిరిగాయి, ఆనందబాష్పాలు తుడుచుకుంటూ కెమెరా కంటికి చిక్కారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మెగా లిస్టింగ్ వేడుకలో అనంత్ అంబానీ మాట్లాడుతూ.. వ్యాపారాన్ని దైవంగా భావించే రిలయన్స్ మూల సూత్రాలను గుర్తుచేశారు. “నాకు వ్యాపారం అనేది ఒక పూజ లాంటిది.. ప్రతీ పూజ ముగింపులో ప్రసాదం ఇచ్చినట్లే, ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్ లో మోగే గంట నాకు గుడి గంటలా అనిపిస్తోంది. ఈ రోజు జియో అనే ప్రసాదాన్ని భారతదేశం మొత్తంతో పంచుకుంటున్నాము” అని ఎంతో హృద్యంగా మాట్లాడారు.
అంతేకాకుండా తన తాతగారైన దివంగత ధీరుభాయ్ అంబానీ సాధారణ చొరవ నుంచి మొదలైన ప్రయాణాన్ని, జియో ద్వారా దేశంలో తీసుకొచ్చిన డిజిటల్ విప్లవాన్ని గుర్తుచేసుకున్నారు. తాను, తన తోబుట్టువులు ఆకాష్, ఈషా అంబానీలు “మూడు శరీరాలు.. ఒకే ఆత్మ” లాగా కలిసికట్టుగా ఉండి ఈ లెగసీని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ భారీ ఐపీఓ దేశీయంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. 95 నిమిషాల్లోనే ఇది పూర్తిగా సబ్‌స్క్రైబ్ అవ్వడమే కాకుండా, ఏకంగా రూ. 7.5 లక్షల కోట్లకు పైగా బిడ్లను ఆకర్షించి పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
ఒకవైపు సరికొత్త రికార్డులతో జియో మార్కెట్ లోకి అడుగుపెడుతుండటం, మరోవైపు తండ్రి కష్టాన్ని, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ పిల్లలు చేసిన ప్రసంగాలు అటు అంబానీ కుటుంబాన్ని, ఇటు ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంత్ ప్రసంగం తర్వాత ఈషా అంబానీ కూడా తన తండ్రి ముఖేష్ అంబానీ విజన్‌కు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆయన ధైర్యానికి సెల్యూట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.












