వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొక్కా మడతపెట్టి.. తొడగొట్టి చెప్పిన డైలాగులు గుర్తున్నాయా..? సరిగ్గా అదే పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా, ఆ పార్టీ నేతలు కనీసం ఊహించని రీతిలో పులివెందుల గడ్డపై తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి జెండా పాతేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాల సునామీ సృష్టించారు.
దాదాపు నియోజకవర్గం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోవడంతో వైసీపీ క్యాడర్ ఘోర నైరాశ్యంలో మునిగిపోయింది. నియోజకవర్గంలోని లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 64 స్థానాలు ఏకగ్రీవంగా కూటమి వశమయ్యాయి. అలాగే మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలకు గానూ 3 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా ముగించేసింది. వేంపల్లి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. అందులో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఈ 17 స్థానాల్లో టీడీపీ 15, బీజేపీ 1, జనసేన 1 చొప్పున పంచుకున్నాయి. కేవలం ఒక్క అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఇక్కడ ఎన్నిక జరగనుండటం విశేషం. ఇక నియోజకవర్గంలోని మిగిలిన మండలాల పరిస్థితి అయితే మరీ దారుణం. వైసీపీ తరఫున నామినేషన్ వేసే నాథుడే లేకుండా పోయాడు. వేముల మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలు, చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలు, తొండూరు మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలు, సింహాద్రిపురం మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలు, లింగాల మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలు, చివరికి పులివెందుల మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాల్లోనూ వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ సొంత గడ్డపైనే కౌంటర్ నామినేషన్లు వేయడానికి కూడా లీడర్లు ముందుకు రాకపోవడం, వేసిన వాళ్లు కూడా వెనక్కి తగ్గిపోవడంతో కూటమి శ్రేణులు పులివెందుల నడిబొడ్డున భారీ ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.












