భారతదేశంలో చిన్నపిల్లల ఆరోగ్యంపై సరికొత్త ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో భాగంగా పిల్లలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవడం, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వారి ఎముకల సాంద్రత దారుణంగా పడిపోతోందని హెచ్చరిస్తున్నారు. పిల్లలు పెద్దలుగా మారే వయసులోనే వారి జీవితకాలానికి సరిపడా ఎముకల బలం చేకూరుతుంది. అయితే ప్రస్తుత అలవాట్ల వల్ల వారి ఎముకలు చిన్న వయసులోనే బలహీనంగా మారుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ అంతర్గత వైద్య విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ స్ఫూర్తి మన్ తెలిపిన వివరాల ప్రకారం.. మునుపటి తరాల పిల్లలతో పోలిస్తే నేటి తరం పిల్లలు ఇళ్లలోనే లేదా తరగతి గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల శరీరానికి సహజసిద్ధంగా లభించాల్సిన ఎండ తగలడం లేదు. ఎండ తగలకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి తగ్గి, మనం తినే ఆహారంలోని క్యాల్షియాన్ని శరీరం శోషించుకోలేకపోతుంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ Physiotherapists నిపుణుల ప్రకారం.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల పాఠశాల పిల్లలలో ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఏకంగా 40 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎముకలు బలంగా తయారవ్వడానికి బరువు మోసే శారీరక వ్యాయామాలు ఎంతో అవసరం. ఇందుకోసం పిల్లలు రోజూ కనీసం 60 నిమిషాల పాటు తాడు ఆట, రన్నింగ్, జంపింగ్ వంటి ఆటలతో పాటు ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి అవుట్డోర్ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఆహార విషయానికొస్తే పిల్లల రోజువారీ డైట్లో పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు రాగులను చేర్చాలి. అలాగే ఎముకల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ల కోసం గుడ్లు, పప్పుధాన్యాలు, గింజలు తినిపించాలి. విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది.
చాలా సందర్భాలలో ఎముకల బలహీనత అనేది ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే లోపల పెరుగుతుంది. అయినప్పటికీ చిన్న చిన్న దెబ్బలకే లేదా చిన్నగా కింద పడినా తరచూ ఎముకలు విరగడం, కారణం లేకుండానే కాళ్ళు, చేతుల ఎముకలు లేదా కీళ్లలో నిరంతరం నొప్పి రావడం, శారీరక ఎదుగుదల నెమ్మదించడం, కండరాల బలహీనత లేదా నడకలో అసాధారణ మార్పులు కనిపించడం వంటివి జరిగితే తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే చిన్న పిల్లల్లో దొడ్డి కాళ్ళు లేదా మణికట్టు వాపులు వంటి రికెట్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లల ఎదుగుదలను, వారి ఆహార అలవాట్లను క్రమ పద్ధతిలో గమనిస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏవైనా లోపాలు ఉన్నట్లు అనుమానం వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి విటమిన్ డి, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి రక్త పరీక్షలు చేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.













