సీఎం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్..!

0
2

ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం, వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి, ఏపీలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అండగా ఉంటుందని, తగిన ఆర్థిక, సహాయక సహకారాన్ని అందిస్తుందని అమిత్ షా భరోసా ఇచ్చారు.

ఈ ఫోన్ సంభాషణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న జిల్లాలైన విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని తాజా పరిస్థితిని కేంద్ర హోంమంత్రికి సమగ్రంగా వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,000 హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగిందని, మరో 10,500 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, రహదారులు కొట్టుకుపోయి, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మౌలిక వసతులు పూర్తిగా ఛిన్నభిన్నమయ్యాయని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో నష్టం తీవ్రత అధికంగా ఉన్నందున.. తుఫాన్ నష్టాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని చంద్రబాబు కోరారు. బాధితుల పునరావాసం, విరిగిపోయిన వ్యవస్థల పునరుద్ధరణ పనుల కోసం తక్షణ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. త్వరలోనే కేంద్ర బృందాలను ఏపీకి పంపుతామని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా కేంద్రం అభినందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.