పార్టీ భవిష్యత్తును దృష్టిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో సరికొత్త పొలిటికల్ మైండ్ గేమ్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార కూటమిని ఒంటరిగా ఎదుర్కోవడం కంటే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వడం ద్వారానే తమకు రాజకీయ రక్షణ లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే లెఫ్ట్ పార్టీలను, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను జగన్ రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తనను జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి దగ్గర చేసే బాధ్యతను వైఎస్ జగన్.. రాష్ట్రంలోని సిపిఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలకు అప్పగించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో బలమైన ప్రచారం నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారాలు నడిపించడం జగన్‌కు సులువైన మార్గంగా మారింది. ఏపీలో కూటమిని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఒకతాటిపైకి రావాలనే నినాదంతో, పరోక్షంగా వైసీపీని కాంగ్రెస్ వైపు నడిపించేందుకు ఈ ఎడమపక్ష పార్టీలు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, జగన్ కాంగ్రెస్ వైపు అడుగులు వేయడానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద అడ్డంకి ఆయన సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్‌ను రాజకీయంగా, వ్యక్తిగతంగా అత్యంత తీవ్రంగా విమర్శిస్తున్న షర్మిల.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్లో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నంత కాలం.. వైసీపీ క్యాడర్ లేదా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అడ్డుపడటం, అలాగే ఆస్తుల వివాదాలు నిరంతరం చర్చకు రావడం జగన్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. అందుకే ఆమెను ఎలాగైనా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ బాధ్యతల నుంచి పక్కన పెట్టించేందుకు జగన్.. కర్ణాటక సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబంతో డీకే శివకుమార్‌కు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరడానికి, ఆ తర్వాత ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడానికి కూడా డీకే శివకుమారే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే డీకే శివకుమార్ ద్వారా.. “ఏపీలో కూటమిని ఓడించాలంటే వైసీపీ సపోర్ట్ అవసరం.. కానీ షర్మిల ఉంటే జగన్ కలిసి రారు.. కాబట్టి ఆమెకు జాతీయ స్థాయిలో లేదా వేరే రాష్ట్రంలో బాధ్యతలు ఇచ్చి, ఏపీ నుంచి మార్చాలి” అనే ప్రతిపాదనను ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఒకవేళ ఈ ఇంటర్నల్ పొలిటికల్ గేమ్ కనుక వర్కవుట్ అయితే.. ఏపీ రాజకీయం మున్ముందు మరిన్ని ఊహించని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.













