Home ఆంధ్రప్రదేశ్ సొంత కోటలో జగన్ రచ్చ వెనుక అసలు వ్యూహం..?

సొంత కోటలో జగన్ రచ్చ వెనుక అసలు వ్యూహం..?

0
3

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పటిష్టమైన కంచుకోటగా, వైఎస్సార్ కుటుంబానికి దశాబ్దాల రాజకీయ గడ్డగా ఉన్న పులివెందులలోనే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయాల్సి రావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

పులివెందులలోని మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 చోట్ల వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా అధికార కూటమి పార్టీలు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. అయితే, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని మరో కోణంలో చూస్తున్నారు. దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం నడిపిన సొంత నియోజకవర్గంలోనే, ఒక మున్సిపల్ ఎన్నిక కోసం కనీసం 70 మంది ఏజెంట్లను కూడా రక్షించుకోలేకపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై గూడుపుఠాణీ ఆరోపణలు చేస్తూ, రాబోయే ఓటమిని ముందే ఊహించి దానికి కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఈ విధమైన సాకులు వెతుకుతున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

పులివెందుల పర్యటన కోసం జగన్ ఎంచుకున్న మార్గం, అక్కడ జరిగిన ల్యాండింగ్ ఉదంతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. భద్రతా నిబంధనలు, ఏవియేషన్ క్లియరెన్స్ లేకపోవడం వల్లే కలెక్టర్, సంబంధిత అధికారులు మధ్యాహ్నం వరకు ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. కానీ, జగన్ ఇంధన కొరతను సాకుగా చూపిస్తూ “ఎమర్జెన్సీ ల్యాండింగ్” పేరుతో బలవంతంగా హెలికాప్టర్ దించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, అధికారిక నిబంధనలను బేఖాతరు చేస్తూ వ్యవస్థలను ఒత్తిడికి గురిచేసేలా ఈ హైడ్రామా ఆడారనే నెగటివ్ టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది.

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతున్న సమయంలో, జగన్ సుమారు 70 మంది అనుచరులతో కలిసి పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించడం అధికారులను భయభ్రాంతులకు గురిచేసే చర్యగా మారుతోంది. స్థానిక కలెక్టర్, ఎస్పీలు తన ఫోన్లు ఎత్తడం లేదంటూ బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం, రాష్ట్ర ఎన్నికల సంఘంపై నిందలు వేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థల నిష్పక్షపాతాన్ని జగన్ శంకిస్తున్నారని విమర్శకులు చెప్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత సృష్టించడానికే ఈ తరహా ఒత్తిడి రాజకీయాలకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి.

పులివెందులలో కేవలం ఒక మున్సిపల్ స్థానాన్ని కోల్పోతే వచ్చే నష్టం కంటే, అక్కడ పార్టీ క్యాడర్ పూర్తిగా కుప్పకూలిందనే సంకేతాలు బయటకు వెళ్తే అది వైఎస్సార్సీపీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే జగన్ ఈ ఇష్యూని కేవలం స్థానిక సంస్థల ఎన్నికగా ఉంచకుండా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్డీఏ కూటమిని ప్రశ్నిస్తూ జాతీయ స్థాయి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంగా రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం మరియు 70 బూత్‌లలో రీ-పోలింగ్ డిమాండ్ చేయడం అంతా ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.