ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ లీడర్, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం మాగంటి కుటుంబానికి గట్టి షాక్ ఇచ్చింది. ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని, కామవరపుకోట మండలం నుంచి తన భార్య చేత జడ్పీటీసీ అభ్యర్థిగా మాగంటి బాబు నామినేషన్ వేయించారు.
అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీడీపీ అధిష్ఠానం ఆమెకు ‘బీ-ఫామ్’ నిరాకరించి, అదే స్థానం నుంచి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కుమార్తె మందలపు జాహ్నవికి బీ-ఫామ్ కేటాయించింది. టీడీపీలో మాగంటి బాబుకు జరిగిన ఈ పరాభవాన్ని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేసింది. దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి రంగంలోకి దిగి ఒక ఆఫర్ ఇచ్చారు. “టీడీపీలో మీకు అన్యాయం జరిగింది, మా వైపు వచ్చేయండి.. జడ్పీటీసీ బీ-ఫామ్ మేము ఇస్తాము” అంటూ మాగంటి బాబును వైసీపీలోకి ఆహ్వానించడానికి అబ్బయ్య చౌదరి ఏలూరులోని బాబు నివాసానికి నేరుగా వెళ్లే ప్రయత్నం చేశారు.
రాజకీయంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఒక మోస్ట్ సీనియర్ లీడర్‌ను తమ వైపు తిప్పుకుంటే జిల్లాలో కూటమికి గట్టి కౌంటర్ ఇవ్వచ్చని వైసీపీ భావించింది. అయితే, ఈ ఆఫర్‌కు మాగంటి బాబు తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ లీడర్ అబ్బయ్య చౌదరి తన ఇంటికి వస్తున్నారనే సమాచారం ముందే అందడంతో, మాగంటి బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేను అని చెప్తూ అబ్బయ్య చౌదరి భేటీ ప్రయత్నానికి బ్రేకులు వేశారు. టీడీపీ అధిష్ఠానంపై లోపల ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ, తక్షణమే విపక్ష పార్టీ వేసిన గాలానికి చిక్కి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని, రాజకీయంగా తనకున్న ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాలని బాబు భావించినట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.














