ప్రణాళిక లేని సీట్ల సర్దుబాట్లు.. టీడీపీ, జనసేన, బీజేపీలలో అసంతృప్తి సెగలు..!

0
5

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రణం పతాక స్థాయికి చేరిన వేళ అధికార కూటమిలో అంతర్గత గందరగోళం, అసంతృప్తి సెగలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవలి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికలపై చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను, సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంటే, అంతకుముందు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదనే సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఎన్నికల్లో కూటమికి ఏకపక్ష ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తున్నప్పటికీ, కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేనలకు ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి తలెత్తింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత సాఫీగా ఈ స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కార్యక్రమం జరగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల మిత్రపక్షాల మధ్యే ‘ఫ్రెండ్లీ ఫైట్’ జరుగుతుండగా, మరికొన్ని చోట్ల కూటమిలో జనసేన, బీజేపీలు సీట్లు తీసుకుని, అభ్యర్థులు దొరక్క వేరే పార్టీల నుంచి నాయకులను అరువు తెచ్చుకుని పోటీ చేయించే విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ దగ్గర్నుంచి సీట్ల సర్దుబాటు వరకు ఎలాంటి ప్రీ-ప్లానింగ్ లేకుండా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా పార్టీల కోసం పనిచేసే నాయకులకు న్యాయం చేయాలనుకుంటే రిజర్వేషన్లను కొంత అటు ఇటు మార్చడం సహజంగానే జరిగే ప్రక్రియ. దీనివల్ల రిజర్వేషన్ల పర్సంటేజి ఏమీ మారదు, ఎవరి కోటా వాళ్లకుంటుంది. పైగా రిజర్వుడు వర్గాలతో పాటు అన్‌రిజర్వుడు వర్గాలలోని అర్హులైన నాయకులకు న్యాయం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోస్టర్ విధానాన్నే ఎంచుకోవడంతో, తొలి రౌండ్ లోనే సమర్థులు, అర్హులైన నాయకులకు చెక్ పడినట్లయింది. ఆ తర్వాత జరిగిన కూటమి పొత్తుల సర్దుబాట్లతో మరికొంతమందికి బ్రేకులు పడటంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది.

అసలు స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడే కూటమిలోని ముఖ్యనేతల మధ్య సంప్రదింపులు జరిగి ఒక అవగాహనకు రావాలి. ఈ ప్రక్రియ అంతా షెడ్యూల్ వెలువడటానికి ముందే జరగాల్సింది. కానీ, షెడ్యూల్ వెలువడటానికి నెల రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు 20 రోజుల పాటు జిల్లాల ప్రభుత్వ పర్యటనల్లోనే బిజీగా గడిపారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సరైనదే అయినా, ఆయన పార్టీ అధ్యక్షుడనే విషయాన్ని మరువకూడదు. ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ముఖ్యమే, ఎందుకంటే పార్టీ లేకపోతే ప్రభుత్వమే ఉండదు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా నిలిచే ఈ స్థానిక ఎన్నికల షెడ్యూల్ రాకముందే సీట్ల విషయంలో ఒక అంగీకారం కుదిరి ఉంటే ఈ గందరగోళం, అసంతృప్తులు ఉండేవి కావు. చివరి నిమిషంలో జరిగిన చర్చల వల్ల అర్హులైన ఎందరో నాయకులకు అన్యాయం జరిగింది.

ఈసారి తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేనంత సమన్వయ లోపం కనిపించిందని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక నేతే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జనసేన పరిస్థితి మరింత తీసికట్టుగా ఉంది. అక్కడ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అధినేత పవన్ కల్యాణ్ కూడా అందరికీ అందుబాటులో ఉండరనే టాక్ ఉంది. టీడీపీ ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిలబడి, కేసులు పెట్టించుకుని, ఆర్థికంగా నష్టపోయిన హార్డ్ కోర్ లీడర్స్ కంటే.. మధ్యలో వచ్చినవాళ్లు, స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉన్నవాళ్లే ఇప్పుడు జాక్‌పాట్‌లు కొట్టారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కష్టపడి నామినేషన్లు వేసిన పాత నాయకులు.. ఎమ్మెల్యేల సపోర్ట్ లేకపోవడం వల్లో, లేదా ఆ సీటు పొత్తులో మిత్రపక్షానికి వెళ్లడం వల్లో చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల సీట్లు తగ్గించుకున్నామని, ఈసారి అలా కుదరదని జనసేన అధినేత ప్రకటించడంతో చాలా చోట్ల కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు పడ్డాయి. అయితే కొన్ని చోట్ల జనసేన, బీజేపీలకు సరైన చైర్మన్ అభ్యర్థులే దొరకలేదు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించిన దారం సుబ్బారావు, ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడంతో కంగుతిన్నారు. అయితే అక్కడ జనసేనకు సరైన అభ్యర్థి లేకపోవడంతో, ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జనసేన అభ్యర్థిగా వైసీపి నేత గొర్లె విజయకుమారిని ఎంపిక చేశారు. కనీసం ఆమె వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయకుండానే జనసేన బి-ఫారమ్ ఇవ్వడం గమనార్హం.

మరోవైపు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అనంతపురంలో బీజేపీ బలం చాలా నామమాత్రం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే గొడవ నడుస్తోంది. గట్టిగా వంద ఓట్లు కూడా లేని మండలాలను బీజేపీకి కేటాయించారు. మున్సిపాలిటీల్లో అయినా కొంత బలగం ఉంటుందేమో కానీ, రూరల్ ఏరియాల్లో బీజేపీకి ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్ లేదు. కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకోవడం, చివరకు అభ్యర్థులు లేక వేరే పార్టీల నుంచి తెచ్చుకుని పోటీ చేయించడం వల్ల ప్రజల్లో చులకన కావడం తప్ప ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో అనపర్తి అసెంబ్లీ సీటు విషయంలోనూ అభ్యర్థి దొరక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు.

బలం లేకపోయినా సీట్లు ఇవ్వడం, ఆయా స్థానాల్లో నామినేషన్లు వేసిన అసలైన అభ్యర్థులను చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకోమని ఒత్తిడి చేయడం కూటమిలో కలకలం రేపింది. మాట వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలపై కూడా అధిష్ఠానం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డబుల్ గేమ్ ప్లే చేయడంతో సొంత పార్టీ నేతలే బలయ్యారు. “ఇందుకోసమేనా మేము ఐదేళ్లు పార్టీ కోసం నిలబడి పోరాడింది?” అని వాపోతున్న నాయకులను, కార్యకర్తలను ఓదార్చేవారే కరువయ్యారు. ఈ పరిణామాల వల్ల ఇప్పటికిప్పుడు పెద్ద సమస్యలు రాకపోయినా.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిన ఈ తప్పులు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.