టీడీపీ క్యాడర్‌ను బుట్టలో వేస్తున్న చిన్న దొర..?

0
6

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రీకృతంగా సాగుతున్న పాలిటిక్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో కేటీఆర్ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీలో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ చంద్రబాబు తన ముందుచూపుతో, నీటి యాజమాన్య నైపుణ్యాలతో కరవును సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును, టీడీపీని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్‌లో ఈ హఠాత్ మార్పు వెనుక కేవలం వాతావరణ విశ్లేషణ మాత్రమే లేదు, దాని వెనుక ఒక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ దాగి ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది.

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో వలస వచ్చిన ఏపీ ఓటర్లు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరులు ప్రభావం చూపే ఏ ఎన్నికల ముందైనా కేటీఆర్ ఇదే రకమైన అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో పాటు మున్ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఖైరతాబాద్‌తో పాటు గ్రేటర్ పరిధిలోని మెజారిటీ డివిజన్లలో కమ్మ సామాజికవర్గం, హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ ఓట్ బ్యాంక్ గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది. ఈ ఓటర్లను ఆకట్టుకుని, కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా దారి మళ్లించడానికే కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు భేష్ అంటూ సరికొత్త రాగం అందుకున్నారనేది ఓపెన్ సీక్రెట్.

అయితే కేటీఆర్ ఇంతలా దిగిరావడానికి గతంలో జరిగిన ఒక పెద్ద రాజకీయ నష్టం ప్రధాన కారణం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భంలో కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్స్ చేసిన కామెంట్స్ తీవ్ర నెగెటివ్ ఇంపాక్ట్ చూపించాయి. ఓ ట్వీట్ లో ఆయన చేసిన కామెంట్స్ మైనస్ అయ్యాయి. అదే విధంగా, హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీలు తీస్తుంటే.. “పక్క రాష్ట్ర గొడవలు మాకెందుకు, ఇక్కడ పర్మిషన్లు ఇవ్వం” అంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించింది. ఈ వైఖరితో ఆగ్రహించిన లక్షలాది మంది సెటిలర్స్, టీడీపీ క్యాడర్ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ వంటి స్థానాల్లో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించారు.

ఆనాడు జరిగిన ఆ రాజకీయ తప్పిదం వల్లే తాము అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆలస్యంగా గ్రహించిన కేటీఆర్.. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఇప్పుడు పక్కాగా నష్ట నివారణ చర్యలకు దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్‌ను ఒక డాలుగా వాడుకుంటూ, అదే సమయంలో ఇక్కడున్న టీడీపీ క్యాడర్‌ను తిరిగి బుట్టలో వేసుకోవడానికి స్కెచ్ వేశారు. “రేవంత్ రెడ్డి కృష్ణా నీళ్లను కిందకు వదిలేస్తే, చంద్రబాబు మాత్రం ముందుచూపుతో ఆ నీటిని కుప్పం వరకు తీసుకెళ్లారు” అంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే. మరి కేటీఆర్ వేసిన ఈ సరికొత్త ‘సార్’ మైండ్ గేమ్ రాబోయే ఖైరతాబాద్, గ్రేటర్ ఎన్నికల్లో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో, సైలెంట్ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మళ్లుతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.