ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో పెట్టుబడుల రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తలెత్తే రాజకీయ వైరుధ్యాలు, కక్షపూరిత చర్యలకు పెట్టుబడిదారులు ఏమాత్రం బలి కాకూడదనే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను, ఇచ్చిన రాయితీలు, భూకేటాయింపులను తర్వాత వచ్చే ప్రభుత్వాలు రద్దు చేయడం వల్ల పారిశ్రామికవేత్తల్లో అభద్రతాభావం పెరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ముందుగా ఏపీ అసెంబ్లీలో పెట్టుబడుల రక్షణ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతామని తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, ఇటువంటి చట్టం దేశమంతా ఉండాలని, ఇందుకోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ప్రతి పారిశ్రామికవేత్తకు పూర్తి స్థాయి భద్రత, నమ్మకం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికే పరిశ్రమల రాయితీల చెల్లింపులో జాప్యం లేకుండా ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు ఈ కొత్త చట్టంతో దేశంలోనే పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిలవబోతోంది. జాతీయ స్థాయిలోనూ ఈ చట్టం అమల్లోకి వస్తే విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగి, భారత్ ఆర్థికంగా వేగంగా దూసుకెళ్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.






