పెట్టుబడులు గెలిపించలేకపోయాయా? సీమలో ప్రమాద ఘంటికలు.!

0
7

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు గెలిచిన, కూటమితో పోటాపోటీగా నిలిచిన నియోజకవర్గాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అరకు, పాడేరు, పోలవరం, గంగాధరనెల్లూరు, నంద్యాల, చంద్రగిరి, కదిరి, పుట్టపర్తి, తంబళ్లపల్లె, సాలూరు, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ గట్టి పోటీ ఇవ్వడంపై అధిష్టానం దృష్టి సారించి, ఆయా ప్రాంతాల్లో కూటమి వైఫల్యానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 111 జడ్పీటీసీలకు గాను కూటమి 92, వైసీపీ 18 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీ గెలుపు శాతం 16.22గా ఉండగా, విజయనగరం జిల్లాలో ఆ పార్టీ ఏకంగా 10 జడ్పీటీసీలు గెలిచి డబుల్ డిజిట్ సాధించింది. ఇక కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 305 స్థానాలకు గాను కూటమికి 283, వైసీపీకి కేవలం 20 స్థానాలు మాత్రమే దక్కాయి. మధ్యాంధ్రలో వైసీపీ గెలుపు శాతం కేవలం 6.5 శాతం కాగా, ఇక్కడి ఏ ఒక్క ఉమ్మడి జిల్లాలో కూడా ఆ పార్టీ 5 సీట్లకు మించి గెలవలేకపోయింది.

మరోవైపు రాయలసీమలో మొత్తం 243 స్థానాలకు గాను టీడీపీ కూటమి 199, వైసీపీ 39 సీట్లు సాధించి 16.05 శాతం విజయాలను నమోదు చేసింది. కడప జిల్లాలో ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసినప్పటికీ, ఉమ్మడి కర్నూలులో 10, చిత్తూరులో 10, కడపలో 8, అనంతపురం జిల్లాలో 11 జడ్పీటీసీలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు కర్నూలులోని నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీలను కూడా వైసీపీ గెలుచుకుంది. కర్నూలులో కూటమి మేయర్ అభ్యర్థి మెజారిటీ ఇతర నగరాలతో పోలిస్తే స్వల్పంగా ఉండగా, డోన్‌లో కోట్ల సుజాతమ్మ గెలవకుండానే గెలిచినట్లు ప్రకటించుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా వైసీపీ డబుల్ డిజిట్ సాధించిన 5 ఉమ్మడి జిల్లాల్లో నాలుగు రాయలసీమవే కావడం గమనార్హం.

ఇక్కడ పెట్టుబడులు, అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తాయా..? అంటే ప్రస్తుత ఫలితాలను బట్టి కచ్చితంగా కాదనే చెప్పాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఉన్న బ్యాడ్ బ్రాండ్ ఇమేజ్‌ను పోగొట్టి పెట్టుబడుల సాధనలో సక్సెస్ అయింది. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా ఉత్తరాంధ్ర లేదా తిరుపతి అన్నట్లుగా ప్రాజెక్టులు కేటాయిస్తూ వచ్చారు. ఈ రెండేళ్లలో ఏపీకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 53.33 శాతం ఉత్తరాంధ్రకు, 33.33 శాతం రాయలసీమకు కేటాయించగా, కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలకు కేవలం 13.34 శాతం మాత్రమే కేటాయించారు.

ఉత్తరాంధ్రకు వచ్చిన రూ. 7.20 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఉమ్మడి విశాఖకు రూ. 6 లక్షల కోట్లు, విజయనగరానికి రూ. 1.17 లక్షల కోట్లు, శ్రీకాకుళానికి రూ. 3 వేల కోట్లు దక్కాయి. ఇందులో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ డేటా సెంటర్, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్ల పెట్టుబడులే రూ. 5 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే రాయలసీమకు 275 ప్రాజెక్టుల ద్వారా రూ. 4.50 లక్షల కోట్లు రాగా, అందులో కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్.. రూ. 16 వేల కోట్లు, తిరుపతి జిల్లా శ్రీసిటీలో.. రూ. 25 వేల కోట్లు, కర్నూలులో సెమీకండక్టర్స్ తయారీ ప్లాంట్.. రూ. 23 వేల కోట్లు, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, రిలయన్స్ బేవరేజెస్ ప్లాంట్.. రూ. 12 వేల కోట్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్.. రూ. 9 వేల కోట్లు ప్రధానమైనవి.

ఇక ఈస్ట్ నుండి ప్రకాశం వరకు ఉన్న మధ్యాంధ్ర జిల్లాలకు మొత్తం రూ. 1.76 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో ఉమ్మడి తూర్పుగోదావరి రూ. 62 వేల కోట్లు.. ఏఎంజీ మెటల్స్ రూ. 44 వేల కోట్లు, పశ్చిమగోదావరి రూ. 600 కోట్లు, పాత కృష్ణా రూ. వెయ్యి కోట్లు, పాత గుంటూరు రూ. 3,300 కోట్లు, ఉమ్మడి ప్రకాశం రూ. 1.68 లక్షల కోట్లు.. అందులో బీపీసీఎల్ రామాయపట్నం రిఫైనరీ రూ. 96 వేల కోట్లు, నెల్లూరు రూ. 8 వేల కోట్లుగా ఉన్నాయి. ఒకవేళ బీపీసీఎల్ రిఫైనరీ లేకపోయుంటే ఈ ఆరు ఉమ్మడి జిల్లాలకు వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 76 వేల కోట్లు మాత్రమే.

ఇందులో రాజధాని అమరావతిలో పిలిచిన రూ. 45 వేల కోట్ల టెండర్లు, జరుగుతున్న పనులను కలపలేదు. ఒకవేళ కలిపినా అది ఇంకో మూడు శాతం మాత్రమే పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ, రాయలసీమపై చూపుతున్న శ్రద్ధ మధ్యాంధ్ర ప్రాంతంపై చూపించడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. అమరావతి విషయంలో కూడా చంద్రబాబు గతంలో చేసినట్లుగా ఫాలోఅప్ చేయడం లేదని, అందుకే పనులు ఆలస్యమవుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది.

అయినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ప్రాంతాల కంటే మధ్యాంధ్ర ప్రాంతమే కూటమికి తిరుగులేని దన్నుగా నిలబడింది. ముఖ్యంగా రాయలసీమ, అందులోనూ కర్నూలు జిల్లా ఫలితాలు కూటమికి ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షించుకుని తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కూటమికి నష్టం జరుగుతుందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.