ఈ-సిగరెట్ ఇంత డేంజరా..?

0
3

ప్రముఖ అంతర్జాతీయ సింగర్, నటి సెలీనా గోమెజ్ ‘వేపింగ్’ అలవాటుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీశాయి. వేపింగ్‌ను ఆమె ఒక “అతి పెద్ద వెధవ అలవాటు”గా అభివర్ణించడంతో.. యువతలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయిన ఈ ఈ-సిగరెట్ల వల్ల వచ్చే నికోటిన్ వ్యసనం, ఊపిరితిత్తుల నష్టాల గురించి వైద్య నిపుణులు మళ్లీ హెచ్చరిస్తున్నారు. సాధారణ సిగరెట్ల కంటే వేపింగ్ సురక్షితం అనుకుంటే పొరపాటేనని, దీనివల్ల గొంతు బొంగురుపోవడం నుంచి మొదలై ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ప్రముఖ పల్మనాలజిస్ట్లు స్పష్టం చేస్తున్నారు.

వేపింగ్ పరికరాల నుండి వచ్చే రసాయన పొగ శ్వాసనాళాల్లో తీవ్రమైన పొడిదనాన్ని, వాపును కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ లేదా వాపు గొంతులోని శబ్ద తంతువులపై పడటం వల్ల గొంతు బొంగురుపోవడం, వాయిస్ అలసట వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గాయకులు, నటులు, ఉపాధ్యాయులు వంటి గొంతుతో ఎక్కువగా పని ఉండే వారికి ఇది శాపంగా మారుతుంది. అంతేకాకుండా, ఈ-సిగరెట్ లిక్విడ్స్‌లో ఉండే అధిక నికోటిన్ నేరుగా మెదడులోని రివార్డ్ పాత్‌వేను ప్రభావితం చేసి, దానిని పదే పదే వాడాలనే బలమైన వ్యసనాన్ని పెంచుతుంది.

దీనిని అకస్మాత్తుగా మానడం వల్ల తీవ్రమైన చిరాకు, ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి విత్‌డ్రాయల్ లక్షణాలు వేధిస్తాయి. ఈ-సిగరెట్లలోని ప్రమాదకర రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరడం వల్ల గురక, ఆస్తమా వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా ఎదుగుతున్న వయసులో ఉన్న యువత మెదడుపై ఇది తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. చాలా మంది వేపింగ్ వల్ల సాధారణ సిగరెట్ల లాంటి పొగ, వాసన రావు కాబట్టి ఇది సురక్షితం అనుకుంటారు, కానీ అందులోని ఫ్లేవరింగ్ ఏజెంట్లు గుండె, శ్వాసకోశ వ్యవస్థను లోపల నుంచి దెబ్బతీస్తాయి. ఎవరైనా వేపింగ్ అలవాటు ఉన్నవారు రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతర గొంతు బొంగురుపోవడం లేదా శ్వాస సమస్యలు ఎదుర్కొంటుంటే.. వెంటనే ఈఎన్‌టీ లేదా శ్వాసకోశ నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.