ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం ఇప్పుడు అమెరికా రాజకీయ, రక్షణ వర్గాలలో దావానలంలా రేగుతోంది. చైనా నిఘా విభాగం తరఫున పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న అలిస్ హువాంగ్ అనే చైనీస్ మహిళతో ఆయన నడిపిన అఫైర్ వ్యవహారం అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారింది. జెన్సన్ హువాంగ్ను తన చైనా పర్యటనకు ఆహ్వానించే ముందే, సదరు మహిళ చైనా గూఢచారి కావచ్చునని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు సంచలన విషయాలను బయటపెట్టాయి.
ఈ వివాదంపై ఈ వారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ విషయం ముందే తెలియదని దాటవేసే ప్రయత్నం చేసినప్పటికీ, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో గతేడాది నుంచే కనీసం రెండుసార్లు ట్రంప్‌కు ఈ క్లాసిఫైడ్ సమాచారాన్ని స్వయంగా చేరవేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో చైనా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తుండగా రూబియో ఈ చైనా స్పై లింకుల గురించి ట్రంప్‌కు ప్రత్యేకంగా బ్రీఫింగ్ ఇచ్చారు.
టెక్నాలజీ రంగంలో అమెరికా ఆధిక్యతను నిలబెట్టే ఎన్విడియా కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ అప్పట్లో ఈ హెచ్చరికలను అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ అఫైర్ వ్యవహారం బయటకు పొక్కడంతో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్‌కు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు రహస్య మెమోలు పంపాయి. శత్రు దేశాలకు అమెరికా అధునాతన సాంకేతికత చేరకుండా నిరోధించాల్సిన బాధ్యత ఈ శాఖదే కావడం ఇక్కడ గమనార్హం. సీఈఓ వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఎన్విడియా మార్కెట్ విలువ కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 430 బిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు రూ. 36 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. చైనా-అమెరికాల మధ్య ఏఐ ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ, ఈ స్పై వివాదం ఎన్విడియా భవిష్యత్తును, అమెరికా రక్షణ వ్యూహాలను ఎలాంటి మలుపు తిప్పుతుందోనని ప్రపంచ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.














