కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల కార్యక్రమంలో ఈసారి కులాల లెక్కలు కూడా తీస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వం బ్రిటిష్ వాళ్లు దేశంలో కులగణన చేశారు. ఏయే కులాల జనాభా ఎంత అనే లేక్క తీశారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రతి పదేళ్లకి జనగణన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కానీ ఎస్సీ ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్క తియ్యడం లేదు. ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు పక్కాగా వున్నాయి. కానీ మిగతా ఓసీ, బీసీ కులాలకు సంబంధించి సరైన సమాచారం లేదు. ఎవరికి వాళ్లు మా కులం అంత పర్సెంట్ వుంది ఇంత పర్సెంట్ వుందని చెప్పుకోవడమే కానీ కచ్చితమైన లెక్కలు లేవు. కుల గణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చాలా కాలంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈసారి జనగణనలో కులగణన కూడా చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ జరుగుతా వుంది. అయితే ఇందులో ఓబీసీ కులాల కాలం లో ప్రతి కులాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా డ్రాప్‌డౌన్ మెనూలో ఆయా కులాల పేర్లు పొందుపరచాలని సూచిస్తున్నారు. దీనివల్ల ప్రతి సామాజికవర్గం జనాభాను కచ్చితంగా నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అప్పుడే బీసీ కులాలన్నింటికి రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని బీసీ సంఘాలు చెప్తున్నారు. ఈ కులగణనలో బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి ఎన్డీయేలో లేని ఇతర పార్టీల నేతలందర్నీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా ఈ కమిటీ నేతలు వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిగారిని కలిశారు.
బీసీల జనాభాకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రయత్నాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని మండల్ జగన్ కు వివరించారు. తగిన జనాభా గణాంకాలు లేని కారణంగా రిజర్వేషన్ల పెంపునకు హైకోర్టు అనుమతి నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 60కి పైగా ఓబీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు జగన్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలు, ఓబీసీల రిజర్వేషన్ హక్కులను పరిరక్షించాలంటే సమగ్ర కులగణన అవసరమని కమిటీ ప్రతినిధులు జగన్‌కు వివరించారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించాలని, స్వయంగా జగన్ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
బీసీ జన గణనకు సంబంధించి వీళ్లు చేస్తున్న డిమాండ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. జగన్ని కలిసినవాళ్లలో మండల్ కమిషన్ మాజీ ఛైర్మన్ బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. బీసీ సంఘాల సభకు ఎన్డీయే కూటమిలో లేని పార్టీలని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్లు సభ పెడుతున్నారు కాబట్టి సహజంగానే ఎన్డీయే పార్టీలని పిలవరు.
వీళ్ల డిమాండ్ కు సంఘీభావం ప్రకటించిన జగన్మోహనరెడ్డి ఢిల్లీ బహిరంగసభకు హాజరావుతారా? కారా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో జగన్మోహనరెడ్డి కేంద్రాన్ని డైరెక్ట్ గా తప్పు పట్టకపోయినా జెన్ జీ ఉద్యమం వెనుక వున్న కారణాలు పరిశీలించాలని, అలాగే ఎన్నికల సంఘాన్ని సంస్కరించాలని, గతంలో కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతిచ్చి తప్పు చేశామని పరోక్షంగా కేంద్ర విధానాలని తప్పు పడుతున్నారు. అయితే ఇప్పుడు బహిరంగసభకు హాజరైతే డైరెక్ట్ గా బిజెపికి వ్యతిరేక వేదికలో భాగమవతారు. అదే జరిగితే జగన్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని నష్టం జరుగుతుంది. కేసుల కత్తి వేలాడుతూనేవుంది కాబట్టి ఇప్పుడిప్పుడే అంత సాహసం చెయ్యకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.














