23 C
Vijayawada
Saturday, November 21, 2026
Home ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవి ఇచ్చినా నాకు అక్కర్లేదు: ఆదినారాయణ రెడ్డి

మంత్రి పదవి ఇచ్చినా నాకు అక్కర్లేదు: ఆదినారాయణ రెడ్డి

0
7

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కడప జెడ్పీ పీఠం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో విజయవాడకు చేరుకున్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడి కుమారులు యువకులు, రాజకీయాల్లోకి వచ్చి ఏకగ్రీవంగా జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారని, కేవలం జెడ్పీ ఛైర్మన్ పదవి కోసమే వారిని పోటీలోకి దింపామని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

ముందుగా ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, తీరా చివరి నిమిషంలో సూపర్ బాల్ మాదిరిగా అభ్యర్థులను మార్చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైన తన తమ్ముడి కుమారుల నిర్ణయానికి తాను పూర్తి మద్దతుగా నిలుస్తున్నానని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో ఎక్కడ మోసం జరిగింది, అభ్యర్థుల మార్పు వెనుక ఎవరున్నారో అన్ని విషయాలను బయటకు తీస్తానని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.

“నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు పదవులు కొత్త కాదు. గతంలో జగన్‌ను ఎదిరించి, ఆయన తప్పులను చూపించి బయటకు వచ్చాను. రాజకీయాల్లో మార్పులు చేయాలంటే నాకు అరసెకను కూడా పట్టదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు తనతో మాట్లాడారని, తనకు బీజేపీ అధిష్ఠానం మద్దతు పూర్తిగా ఉందని తెలిపారు. అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, దీనిపై తన తుది నిర్ణయాన్ని రేపు ఉదయం ప్రకటిస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇందులో ప్రత్యామ్నాయాలకు తావులేదని, ఏకంగా మంత్రి పదవి ఇచ్చినా తనకు అవసరం లేదని తెగేసి చెప్పారు.

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. లోపమంతా అక్కడే ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయానికి, రాష్ట్రంలో బీజేపీకి ఇస్తున్న సీట్లకు అసలు పొంతనే లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇస్తున్న పదవులు ఏమాత్రం చాలవని, బీజేపీకి ఇంకా చాలా ఇవ్వాల్సి ఉందని డిమాండ్ చేశారు. కడప జెడ్పీ ఛైర్మన్ పదవి రాకుండా ఎవరు ఆపారో, దీని వెనుక జరిగిన రాజకీయాలేంటో తనకు తెలియాల్సిందేనని, అన్ని చర్చల తర్వాత అసలు నిజాలు బయటపడతాయని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.