22.5 C
Vijayawada
Sunday, November 22, 2026
Home తెలంగాణ కొళత్తూరులో మళ్లీ స్టాలిన్ పోటీ చేస్తారా?

కొళత్తూరులో మళ్లీ స్టాలిన్ పోటీ చేస్తారా?

0
7

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. కొళత్తూరు నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అక్కడ ఉపఎన్నిక నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2011 నుంచి వరుసగా మూడుసార్లు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహించిన ఈ కంచుకోటలో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థి వీఎస్ బాబు సంచలన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన బాబు హఠాన్మరణం చెందడంతో, ఇప్పుడు కొళత్తూరు ఉపఎన్నికపై తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఈ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ బరిలోకి దిగాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవడానికి, స్టాలిన్ సొంత గడ్డపై గెలిచి సభలో అడుగుపెట్టడం ఎంతో అవసరమని డీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి. దీనిపై డీఎంకే ఎంపీ సి. రవీంద్రన్ స్పందిస్తూ, తమ నాయకుడు మళ్లీ కొళత్తూరు నుంచి పోటీ చేస్తే చూడాలని కార్యకర్తలందరికీ ఉందని, అయితే అక్కడ బరిలోకి దిగాలా వద్దా అనే తుది నిర్ణయం పూర్తిగా స్టాలిన్‌దేనని స్పష్టం చేశారు.

అయితే, ఒకవేళ స్టాలిన్ మళ్లీ పోటీ చేసి అనుకోని విధంగా రెండోసారి ఓటమి పాలైతే రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అధికారంలో ఉన్న విజయ్ పార్టీ టీవీకేకు కూడా ఈ ఉపఎన్నిక ఒక పెద్ద ప్రతిష్టాత్మక అగ్నిపరీక్షగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేతనే ఓడించి కైవసం చేసుకున్న ఈ హై-ప్రొఫైల్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని విజయ్ వ్యూహాలు రచిస్తున్నారు. వీఎస్ బాబు మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటు తమ ప్రభుత్వ పనితీరు కలిసివస్తుందని టీవీకే నమ్ముతోంది. ఒకవేళ స్టాలిన్ స్వయంగా పోటీకి సిద్ధమైతే, కొళత్తూరు ఉపఎన్నిక డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.