హైదరాబాద్ గచ్చిబౌలిలో మెటా కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. కార్యాలయంలోకి చొరబడి మెటాకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూలకుండీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వీళ్ల నిరసనకు కారణం ఏంటంటే ఇటీవల ఫేస్ బుక్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎకౌంట్లని బ్లాక్ చేసింది. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్చార్జి మనీష్ శర్మకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించడంతో వివాదం మొదలైంది.
తమ నేతల ఖాతాలను ఎందుకు నిలిపివేశారని యువజన కాంగ్రెస్ ప్రశ్నించింది.కేవలం తమ ఇద్దరు నేతల ఖాతాలే కాకుండా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పోస్టులపై కూడా మెటా ఆంక్షలు విధిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా యువజన కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.మెటా సంస్థ ఫేస్ బుక్ తో పాటు అనేక సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ నిర్వహిస్తోంది.
ఇటీవల కాలంలో ఫేస్ బుక్ పోస్టులు, ఎకౌంట్లు తరచుగా బ్లాక్ చేస్తోంది. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్ లు విజ్నాన, వినోదాలు, అభిప్రాయాలు, కాలక్షేపాలకే కాకుండా రాజకీయ నాయకులకు ప్రచార వేదికలుగా ఉపయోగపడుతున్నాయి.. అలాగే ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించే వేదికలు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వేదికలివి. ఒక్క పోస్టుతో రాజకీయ ప్రకంపనలు సృష్టించగలిగే శక్తి సోషల్ మీడియాకు ఉంది.అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెంచుతోంది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఖాతాలే బ్లాక్ అవుతున్నాయి. సోషల్ మీడియా సంస్థ మెటా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ పెట్టినా బ్లాక్ చెయ్యడం తరచుగా జరుగుతోంది. ఒక వైపు బండబూతుల పోస్టులని అనుమతిస్తూ, ప్రజలకు ఉపయోగపడే సమాచారం, సమస్యల గురించి పెట్టిన పోస్టులు, వీడియోలు బ్లాక్ చెయ్యడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలేమిటి? కాంగ్రెస్ నేతల ఖాతాలపై మెటా ఎందుకు ఆంక్షలు విధించింది? ఈ వివాదం వెనుక రాజకీయ కోణం ఏమిటి? అనే విషయాలని పరిశీలిస్తే.. సోషల్ మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెంచేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2021లో తీసుకొచ్చిన ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్‌కు 2026 ఫిబ్రవరిలో మరికొన్ని సవరణలు చేసింది. ఈ కొత్త మార్పులు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ సవరణల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే… సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి ఇచ్చే గడువును భారీగా తగ్గించడం. గతంలో సంబంధిత ప్రభుత్వ అధికారి లేదా న్యాయస్థానం నుంచి ఆదేశాలు అందిన తరువాత సోషల్ మీడియా సంస్థలకు 36 గంటల సమయం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువును మూడు గంటలకు తగ్గించారు. అంటే ఒక ప్రభుత్వ అధికారి నుంచి చెల్లుబాటయ్యే ఆదేశం అందితే, సంబంధిత పోస్టును మూడు గంటల్లో తొలగించాలి లేదా దాని యాక్సెస్‌ను నిలిపివేయాలి. ఎందుకొచ్చిన కేసుల గొడవని మెటా సంస్థ ఆ పోస్టుల యాక్సెస్ ని ఇండియాలో నిలిపేస్తోంది.
అయితే.. ఒక పోస్టు చట్టవిరుద్ధమైనదా? అందులో తప్పుడు సమాచారం ఉందా? అది రాజకీయ విమర్శనా? లేక ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యనా? అనే విషయాలను పరిశీలించడానికి సోషల్ మీడియా సంస్థలకు మూడు గంటలే సమయం ఇస్తే ఎలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్టు పెట్టిన వాళ్ల వెర్షన్ వినిపించడానికి అవకాశంకూడా మెటా అవకాశం ఇవ్వకుండా ముందు బ్లాక్ చేసి పడేస్తోంది.
కేంద్రం తీసుకొచ్చిన సవరణల్లో నకిలీ వీడియోలు, ఫొటోలు, ఆడియోలను గుర్తించడానికి, వాటిపై ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ అనే గుర్తింపు ఉండేలా చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఇచ్చే సమయాన్ని కూడా తగ్గించారు. ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే… డీప్‌ఫేక్‌లు, సైబర్ నేరాలు, తప్పుడు వార్తలు, విద్వేష ప్రచారాన్ని అరికట్టడానికే ఈ మార్పులు తీసుకొచ్చామని. కానీ ప్రతిపక్షాలు, డిజిటల్ హక్కుల కార్యకర్తలు, సంఘాలు లేవనెత్తుతున్న ప్రశ్న మాత్రం వేరుగా ఉంది. తప్పుడు సమాచారాన్ని అరికట్టడం పేరుతో ప్రజలకు సమాచారం అందకుండా చేస్తున్నారంటున్నారు.
రాజనీతి చానల్ పేజీలో గత వారం రోజులుగా పోస్టు చేసిన వీడియోల్లో మూడు వీడియోలు మెటా బ్లాక్ చేసింది. అవేమీ అభ్యంతరకరమైన వీడియోలు కాదు. పెట్టుబడులు, స్థానిక ఎన్నికల పొత్తుల మీద చేసిన వీడియోలు. అందులో బూతులో, వ్యక్తిగత విమర్శలో లేవు. కానీ ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ పెట్టి ఆపేస్తున్నారు. మెటా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పోస్టులను గుర్తించి, కొన్ని సందర్భాల్లో మానవుల ప్రత్యక్ష పరిశీలన లేకుండానే బ్లాక్ చేసే విధానం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సహయోగ్ (Sahyog) పోర్టల్ ద్వారా ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియా సంస్థలకు అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ వివరాలను పంపుతారు.
మెటా తన సిస్టమ్‌ను ఈ ప్రక్రియతో అనుసంధానం చేసింది. దీంతో ఆటోమేటిగ్గా పోస్టులు బ్లాక్ అవుతున్నాయి. ఇటీవల ప్రముఖ న్యాయ వార్తా సంస్థ LiveLaw తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుప్రీంకోర్టు విచారణలకు సంబంధించిన మూడు వీడియోలు పోస్టు చేసింది.వాటిలో రెండు వీడియోలు పోస్టు చేసిన 15 నిమిషాల్లోనే భారతదేశంలో బ్లాక్ అయ్యాయి. ఎందుకు బ్లాక్ చేశారో స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వలేదని LiveLaw అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై LiveLaw ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మెటా ఆటోమేటెడ్ ఫిల్టర్, కేంద్ర ఐటీ నిబంధనల్లోని Rule 4(4) రాజ్యాంగబద్ధతను సవాలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మెటాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2027 జనవరి 18కి వాయిదా వేసింది.
ఇక్కడ మెటా వైపు నుంచి ఆలోచిస్తే, భారతదేశం కూడా మెటాకు అత్యంత కీలకమైన మార్కెట్. భారతదేశంలో వ్యాపారం చేయాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం సోషల్ ప్లాట్ ఫారాల మీద ఉక్కుపాదం మోపుతోంది. కేసులకు భయపడి ఆయా సంస్థలు కంటెంట్ బ్లాక్ చెయ్యడం, అకౌంట్లు బ్లాక్ చెయ్యడం చేస్తున్నాయి. ఇప్పుడు అందరి విమర్శ ఏంటంటే బీజేపీకి అనుకూలంగా లేని పోస్టులు, ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తుల ఖాతాలపై మెటా ఆంక్షలు విధిస్తోందని. మెటా సంస్థ భారతదేశంలోని చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని చెబుతోంది.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారతదేశంలో స్థానిక చట్టాల కారణంగా 54 లక్షలకు పైగా పోస్టులు లేదా ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అంతకుముందు ఆరు నెలల్లో ఈ సంఖ్య కేవలం 70 వేలుగా ఉంది.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను అరికట్టాలి. డీప్‌ఫేక్‌లను నియంత్రించాలి. మహిళలను వేధించే పోస్టులపై చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులు, సమాచారాన్ని తెలియ చేసే పోస్టులని కూడా ఆపేస్తే ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు రక్షణ వుండదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ విధించిన ప్రెస్ సెన్సార్షిప్ కు దీనికి పెద్ద తేడా ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛని రాజకీయపార్టీలు హరించలేవు.
అలా హరిస్తే ఆ తరువాత జరిగే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని చరిత్ర చెబుతోంది.సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రభుత్వాలకు భయపడి పనిచేయకూడదు. రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగకూడదు. పారదర్శకత, నిష్పక్షపాతమే వాటి పనితీరుకు ప్రాతిపదిక కావాలి. లేకపోతే రేపు మనం సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలి? ఏం రాయకూడదు? అనేది కూడా ప్రభుత్వాలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది.














