30 C
Vijayawada
Monday, November 23, 2026
Home ఆంధ్రప్రదేశ్ యలహంక ప్యాలెస్ వివాదంలో సంచలన ట్విస్ట్..!

యలహంక ప్యాలెస్ వివాదంలో సంచలన ట్విస్ట్..!

0
2

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతోంది. బెంగళూరులోని అత్యంత విలువైన యలహంక ప్యాలెస్ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తన కుమార్తె అంజలి వివాహ వేడుకలకు సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలను యలహంక ప్యాలెస్‌లో నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకోగా, జగన్ కర్ణాటకలోని దేవనహళ్లి కోర్టును ఆశ్రయించారు.

ఆ నివాసంలోకి షర్మిల గాని, ఆమె తరఫు వ్యక్తులు గాని ప్రవేశించకుండా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు (ఇంజంక్షన్ ఆర్డర్) తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిల, తల్లి విజయమ్మలను బెంగళూరు పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా ఈ వివాదంలో బంగారం, విలువైన ఆభరణాల అంశం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యలహంక ప్యాలెస్ లోపల తన మనవరాలు అంజలి పెళ్లి కోసం దాచిన బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని వైఎస్ విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్యాలెస్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అయితే, ఆ ప్యాలెస్‌తో పాటు అందులో ఉన్న నగలు కూడా ఇచ్చేది లేదని జగన్ తన తల్లి విజయమ్మకు ఫోన్ చేసి తెగేసి చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2009 నుంచి యలహంక నివాసంలో షర్మిల కుటుంబం ఉంటున్నారని, వైఎస్సార్ బతికున్నప్పుడే ఆస్తుల పంపకం జరగలేదని, నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని ఆయన ఆదేశించారని విజయమ్మ గతంలోనే నోటరీ పత్రాలతో సహా స్పష్టం చేశారు.

ఎంవోయూలో లేని యలహంక భూమి కూడా షర్మిలకే చెందుతుందని తల్లి స్వయంగా సాక్ష్యం చెప్పినప్పటికీ, జగన్ న్యాయపరంగా అడ్డుకట్ట వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మేనకోడలి పెళ్లి వేడుకలు జరుగుతుంటే, కనీసం లోపల ఉన్న మనవరాలి బంగారం, వ్యక్తిగత సామగ్రిని కూడా తీసుకోనివ్వకుండా గేట్లు మూసివేయడంపై వైఎస్ కుటుంబ సన్నిహితుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై నేడు దేవనహళ్లి కోర్టులో విచారణ జరగనుండగా, న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.