ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య తొలి అధికారిక సమావేశం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు సాగే ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి నలుగురు చొప్పున సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున రాజేంద్ర పాల్ గౌతమ్, ఆరాధన మిశ్రా, ఇమ్రాన్ మసూద్, వీరేంద్ర చౌదరి హాజరవుతుండగా, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రామ్‌గోపాల్ యాదవ్, శ్యామ్‌లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా హసన్ పాల్గొంటున్నారు.
ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి నేరుగా హాజరుకాకపోయినా, తెరవెనుక ఉండి చర్చల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కనీసం 100కు పైగా సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇందులో భాగంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న 55 నుంచి 60 ‘ఏ-గ్రేడ్’ స్థానాలను తమకు కేటాయించాలని కోరుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచిన నియోజకవర్గాలతో పాటు, తమ సంప్రదాయ దళిత-ముస్లిం-బ్రాహ్మణ ఓటు బ్యాంకు బలంగా ఉన్న స్థానాలపై కాంగ్రెస్ కన్నేసింది.
ఇప్పటికే ఏకంగా 181 స్థానాలతో కూడిన జాబితాను సమాజ్‌వాదీ పార్టీకి పంపిన కాంగ్రెస్, గతంలో 2017 ఎన్నికల్లో తమకు 105 సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే, ఈ ఎన్నికలు తమకు చావోరేవో లాంటివని భావిస్తున్న అఖిలేష్ యాదవ్, కేవలం సీట్ల సంఖ్య కంటే గెలిచే సత్తా ఉన్న స్థానాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు, రెండు శాతం ఓట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్‌కు 55 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలిచిన సహారన్‌పూర్ దేహత్, బెహత్, అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల విషయంలో ఇరు పార్టీల మధ్య పీటముడి నెలకొంది.
గాంధీ కుటుంబానికి కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీ జిల్లాల్లోని అన్ని స్థానాలను తమకే ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుండగా, సహారన్‌పూర్ స్థానాలపై ఇమ్రాన్ మసూద్ పట్టుబడుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అడుగుతున్న స్థానాలకు సంబంధించి గెలుపు లెక్కలు, ఎన్నికల వ్యూహాలను వివరించాలని సమాజ్‌వాదీ పార్టీ నేతలు నేటి భేటీలో ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ మధ్య మంచి అవగాహన ఉన్నందున, అవసరమైతే కొన్ని స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ నేతలను కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయించే రాజీ ఫార్ములాతోనైనా ఈ వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.














