26 C
Vijayawada
Tuesday, November 24, 2026
Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక అడుగు..!

ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక అడుగు..!

0
3

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ‘ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్’ను ఏర్పాటు చేస్తూ హోంశాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ నూతన విభాగం పనిచేయనుంది.

ఇప్పటివరకు శాంతిభద్రతల విభాగంలో భాగంగానే ట్రాఫిక్ పర్యవేక్షణ కొనసాగుతుండగా, పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా పూర్తిస్థాయి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ డైరెక్టరేట్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) పరిపాలన, కార్యాచరణ నియంత్రణలో పనిచేస్తుంది. ఈ ప్రత్యేక విభాగానికి పూర్తిస్థాయి బాధ్యతలు వహించేందుకు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయి అధికారిని డైరెక్టర్‌గా, ఆయనకు సహాయకుడిగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయి అధికారిని నియమించనున్నారు.

వీరి పర్యవేక్షణలో రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన నగరాల్లోని ట్రాఫిక్ కూడళ్లపై నిరంతర నిఘా ఉండనుంది. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్‌’లను గుర్తించడం, అక్కడ ప్రమాదాలు జరగడానికి గల సాంకేతిక కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలు చేపట్టడం ఈ డైరెక్టరేట్ ప్రధాన విధులుగా ఉంటాయి. ఈ నూతన విభాగం ఏర్పాటులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి కూడా అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రస్తుత పోలీసు శాఖలో ఉన్న సిబ్బంది, వనరులతోనే దీనిని నిర్వహించాలని సర్కార్ స్పష్టం చేసింది.

కొత్త పోస్టుల సృష్టి లేకుండానే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సమర్థవంతంగా పునర్వ్యవస్థీకరించి ఈ డైరెక్టరేట్‌కు అనుసంధానం చేయనున్నారు. రవాణా శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ , రోడ్లు-భవనాల శాఖ, వైద్యారోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ విభాగం పనిచేస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత కెమెరాలు, స్పీడ్ గన్‌ల వినియోగంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో వైద్య సహాయం అందేలా చూడటమే ఈ డైరెక్టరేట్ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవించే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.