26 C
Vijayawada
Tuesday, November 24, 2026
Home అంతర్జాతీయం రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!

రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!

0
1

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం తన దాడుల వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన ఉక్రెయిన్ ప్రతిదాడులు, ఇప్పుడు ఏకంగా రష్యా కీలక సైనిక స్థావరాలతో పాటు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లోని రష్యా నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇటీవల పోలాండ్, లిథువేనియా దేశాల మధ్య ఉన్న రష్యన్ భూభాగం కలినిన్‌గ్రాడ్‌లో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా హెచ్చరిక సైరన్లు మోగడం సంచలనం సృష్టించింది.

బాల్టిస్క్ నావికా స్థావరం సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలను గుర్తించిన రష్యా వైమానిక రక్షణ దళాలు అప్రమత్తమై ఆకాశంలోకి కాల్పులు జరిపాయి. మరోవైపు, దక్షిణ ఉక్రెయిన్‌కు దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న లిబియా దేశంలోని బెంఘాజీ పోర్టులో రష్యాకు చెందిన ‘మెర్క్యూరీ’ అనే అత్యాధునిక యుద్ధనౌకపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఇంధనం, ఆయుధాల సరఫరా కోసం అక్కడ ఆగిన సమయంలో జరిగిన ఈ మెరుపు దాడిలో యుద్ధనౌకలో భారీగా మంటలు చెలరేగి సముద్రంలో మునిగిపోయింది.

దీనితో పాటు ఫిన్లాండ్ గల్ఫ్‌లో వెళ్తున్న మరో రష్యా కార్గో నౌకపైనా డ్రోన్ దాడి జరగడంతో రష్యా నౌకాదళంలో కలకలం మొదలైంది. సొంతంగా భారీ నౌకాదళం లేకపోయినప్పటికీ, అత్యాధునిక మానవరహిత సముద్ర డ్రోన్లను అస్త్రాలుగా మార్చుకున్న ఉక్రెయిన్ సైన్యం రష్యాకు ఊహించని నష్టాన్ని కలిగిస్తోంది. నాటో దేశాల సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న కలినిన్‌గ్రాడ్ వరకు ఉక్రెయిన్ డ్రోన్ల ప్రభావం విస్తరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తన కీలక స్థావరాలపై జరుగుతున్న ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా కూడా కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై భారీ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.