ఆంధ్రప్రదేశ్ లో ‘ఏ ప్రాజెక్ట్ పూర్తయినా ఆ క్రెడిట్ నాదంటే నాది’ అని కొట్టుకోవడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కామన్ అయిపోయింది. ఏపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న.. వెలిగొండ, పోలవరంతో పాటు విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్, కృష్ణా రిటైనింగ్ వాల్ ప్రాజెక్టులు కూడా తానే పూర్తి చేశానని గట్టిగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు, అధికారిక రికార్డులను గమనిస్తే మాత్రం కథ వేరేలా కనిపిస్తోంది. అసలు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ 4 ప్రధాన ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయిలో జరిగిన అసలు పనులు ఎంత..? జగన్ చేసిన క్రెడిట్ క్లెయిమ్స్ వెనుక ఉన్న నిఖార్సైన నిజాలేంటి..?
మొదట పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే.. దీనికి అత్యంత కీలకమైన ట్విన్ టన్నెల్స్ తవ్వకం పనులను పూర్తి చేసి మార్చి 6, 2024న జగన్ జాతికి అంకితం చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం సొరంగాలు తవ్వడం పూర్తి కాగానే ప్రాజెక్ట్ పూర్తయినట్లు కాదు. టన్నెల్ లోపల కాంక్రీట్ లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, మరియు నల్లమలసాగర్‌కు నీటిని తీసుకెళ్లే ఫీడర్ కాలువ పనులు అప్పట్లో పూర్తిగా పెండింగ్‌లోనే ఉండిపోయాయి.
పైగా టన్నెల్ లోపల పనులు పూర్తి కాకుండానే.. కేవలం ఎన్నికల స్టంట్‌గా, ఎలాంటి నీటి విడుదల లేకుండానే జగన్ ఆనాడు ప్రారంభోత్సవం చేసేశారని రికార్డులు చెబుతున్నాయి. దీనికి తోడు ముంపు గ్రామాలకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వైసీపీ పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజలను ఖాళీ చేయించకుండా జలాశయంలోకి నీటిని ఎలా నిల్వ చేస్తారు? అందుకే జగన్ హయాంలో వెలిగొండ నుంచి చుక్క నీరు కూడా రాలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే భారీ నిధులు ఇచ్చి పనులు ముగించడంతో ఈరోజు సీమకు నీళ్లు వచ్చాయి.
ఇక ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే వివాదం మరింత పెద్దది. జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదా చేశామని చెప్పుకున్నప్పటికీ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం ప్రధాన డ్యామ్ పనులు పూర్తిగా మందగించాయి. అధికారిక నివేదికల ప్రకారం.. ఆ 5 ఏళ్లలో కేవలం 2 శాతం ప్రగతి మాత్రమే రికార్డైంది. దీనికి తోడు, 2020 గోదావరి వరదల సమయంలో పోలవరం యొక్క అత్యంత కీలకమైన డయాఫ్రాం వాల్ తీవ్రంగా దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వం దీని నిర్వహణపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం, గైడ్‌లైన్స్ పాటించకుండా పనులు చేయడ వల్లే డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయిందని, దానివల్ల ప్రాజెక్టు నిర్మాణ కాలం తీవ్రంగా వెనక్కి వెళ్లిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇక విజయవాడ ప్రజలకు బాగా తెలిసిన కనకదుర్గ ఫ్లైఓవర్ కథ చూస్తే.. దీని పనులు 2014-19 మధ్య చంద్రబాబు హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసి అక్టోబర్ 2020న దీనిని ప్రారంభించారు. పనులు పూర్తి చేసింది గత ప్రభుత్వమే అయినప్పటికీ.. ప్రారంభోత్సవం తమ హయాంలో జరిగింది కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం తమదే అన్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఇక కృష్ణా రివర్ ఫ్లడ్ రిటైనింగ్ వాల్ అంటే వరద రక్షణ గోడ) విషయానికి వస్తే.. దీనిని మూడు దశల్లో నిర్మించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫేజ్-3 పనులను పూర్తి చేసి మార్చి 2024 లో ప్రారంభించారు. మొన్నటి విజయవాడ వరదల సమయంలో ఈ రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణా లంక ఏరియా ముంపునకు గురికాకుండా బతికిపోయిందని వైసీపీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది. కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు జగన్ ఆ బ్రిడ్జి మీదికి వచ్చి కేవలం షో మాత్రమే చేశారని, క్షేత్రస్థాయిలో బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదీ జగన్ హయాంలో జరిగిన ఆ ప్రధాన ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలు గ్రౌండ్ రియాలిటీ. కేవలం ప్రారంభోత్సవాల బోర్డులు వేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చి.. కీలకమైన పోలవరం పనులు మరియు వెలిగొండ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగిందనేది వాస్తవం.





