ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఊహించని అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడింది. “స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా పోటీ చేయాల్సిందే, ఎక్కడా ఏకగ్రీవాలు కావొద్దు” అంటూ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేడర్‌కు గంభీరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలతో, అభ్యర్థులతో కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడి సమన్వయం చేసే సరైన నాయకుడే ఇప్పుడు తాడేపల్లిలో కరువయ్యాడు.
ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన కీలక నేతలు సైలెంట్ అయిపోగా.. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై వైకాపా నేతల్లో మంట వేరే లెవెల్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. సజ్జల స్వయంగా ఫోన్ చేసినా సరే, స్థానిక నేతలు కనీసం ఆన్సర్ కూడా చేయడం లేదనే సంచలన వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెగ వైరల్ అవుతోంది.
గతంలో ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. వైకాపా కేంద్ర కార్యాలయం నేతలతో, సమన్వయ కమిటీలతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పార్టీలో సీనియర్లయిన వైవీ సుబ్బారెడ్డి, అలాగే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కీలక నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకోవడానికి గానీ, డిస్ట్రెస్ లో ఉన్న కేడర్‌తో మాట్లాడటానికి గానీ వీరెవరూ ముందుకు రావడం లేదు.
దీనివల్ల జిల్లాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఏ విధమైన రాజకీయ, ఆర్థిక భరోసా ఇచ్చే లీడర్ కేంద్ర కార్యాలయంలో లేకుండా పోయారు. ఒకవైపు జగన్ ఏమో ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలంటుంటే, మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ కోఆర్డినేషన్ పరంగా పూర్తిగా ఖాళీ అయిపోవడం గమనార్హం. ఇక పార్టీలో మిగిలిన ఏకైక కీలక వ్యూహకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై వైకాపా లీడర్లలో అసంతృప్తి మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగిపోయింది. గత 2024 ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితమవ్వడానికి మరియు పూర్తిగా అధికారం కోల్పోవడానికి సజ్జల అవలంబించిన ఒంటెద్దు పోకడలు, తప్పుడు నివేదికలే కారణమనే బలమైన నమ్మకం మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల ఇన్‌ఛార్జ్‌లలో ఉంది.
ఐదేళ్ల పాటు సామాన్య కార్యకర్తలను, నేతలను జగన్‌కు దూరం చేసింది సజ్జల గ్రూపేనని వారు లోలోపల రగిలిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనే తాడేపల్లిలో కూర్చుని స్థానిక ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించడాన్ని క్షేత్రస్థాయి నేతలు ఎంతమాత్రం సహించలేకపోతున్నారు. అందుకే ఆయన మాట వినడానికి గానీ, ఆయన ఇచ్చే డైరెక్షన్లను పాటించడానికి గానీ ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. రాజకీయ వర్గాల్లో నడుస్తున్న తాజా సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సజ్జల స్వయంగా కొందరు జిల్లాల కీలక నేతలకు ఫోన్లు చేస్తున్నారట.
కానీ చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లు సజ్జల నంబర్ చూసి ఫోన్లను కట్ చేస్తున్నారని లేదా అసిస్టెంట్ల చేత ‘సార్ అందుబాటులో లేరు’ అని చెప్పిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికే కేసులు, విచారణల భయంతో సగం మంది నేతలు సైలెంట్ కాగా.. తాడేపల్లి నుండి వస్తున్న ఈ ఫోన్ కాల్స్ తమను మరింత ఇబ్బందుల్లోకి నెడతాయనే ఆందోళన వారిలో ఉంది.
సజ్జల లాంటి నేతలు ఫోన్ చేస్తేనే వినని పరిస్థితి ఉంటే.. ఇక జగన్ అనుకుంటున్నట్లుగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఎలా సాధ్యమవుతుందనేది వైకాపా అంతర్గత వర్గాలకే పెద్ద ప్రశ్నగా మారింది. అధినేత ఆదేశాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో నేతల అసంతృప్తి, సమన్వయ లోపం మరోవైపు.. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య వైకాపా స్థానిక సంస్థల ఎన్నికల రణక్షేత్రంలో ఎలా రాణించబోతోందో చూడాలి.







