తూచ్ ఎన్నికలు వద్దు.. బాయకాట్ చేస్తా అంటున్న జగన్..?

0
8

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని, తాడేపల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతూ, తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే నెపంతో.. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా బహిష్కరించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వచ్చే రాజకీయ నష్టం కంటే, అధికార పార్టీ అరాచకాల వల్లనే తాము తప్పుకుంటున్నామనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం బెటర్ అనే యాంగిల్‌లో వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల హవా ముందు వైసీపీ క్యాడర్ నిలబడలేకపోతోందని, చాలా చోట్ల అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి, నామినేషన్ల అడ్డుగింపులనే ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ ఎన్నికల ప్రక్రియ నుంచే వైదొలిగితే పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన గవర్నర్‌కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.

తాడేపల్లిలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో మున్సిపల్ ఎన్నికల బహిష్కరణపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్నికలను బహిష్కరిస్తే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుందని జాతీయ స్థాయిలో ప్రచారం చేయవచ్చనేది వైసీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. అయితే, పోరాడకుండా ఇలా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే క్షేత్రస్థాయిలో మిగిలిన కొద్దిపాటి క్యాడర్ కూడా పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోతుందనే ఆందోళన కూడా పార్టీలోని కొందరు సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ అత్యవసర సమావేశం ముగిసిన అనంతరం ఎన్నికల బహిష్కరణపై జగన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయబోతున్నారనే అంశంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.