ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతున్న మల్టీ-కోట్ల లండన్ ఉద్యోగాలు, వీసా మోసం కేసు దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘నందూస్ వరల్డ్’ ఛానల్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ అన్నే రమా నందన ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లండన్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో లుకౌట్ నోటీసుల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోగా, తాజాగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక బాధితుడి ఫిర్యాదు ప్రకారం, లండన్‌లో ఉద్యోగాలు మరియు వీసా స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ రమా నందన, ఆమె భర్త జగర్లమూడి మధుకర్ కలిసి పెద్ద మొత్తంలో వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని పోలీసు బృందం రమా నందనను తన న్యాయవాదుల సమక్షంలో స్టేషన్‌లో సుదీర్ఘంగా ప్రశ్నిస్తూ ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. లండన్ ఉద్యోగాల ఆశతో మోసపోయిన మరికొంత మంది బాధితుల వివరాలు, ఈ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీల కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.






