ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల తర్వాత తప్పుడు వార్తలతో హంగామా చేసిన సోషల్ మీడియా ట్రోలర్స్‌కు నిద్ర లేకుండా చేసిన మరో పవర్ ఫుల్ ఆఫీసర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా ఉన్న ఈమె ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విధానం చూసి ఐఏఎస్ సర్కిల్స్ కూడా సలాం కొట్టాయి. అసలు ఎవరీ తమీమ్ అన్సారియా..? తమిళనాడుకు చెందిన ఈమె.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టారు. 2015 బ్యాచ్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐఏఎస్ సాధించారు.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి.. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు.. ఇటుక బట్టీల్లో బందీలుగా ఉన్న వందలాది మంది బాండెడ్ లేబర్ అంటే వెట్టిచాకిరీ బాధితులను రక్షించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. చట్టాలు, ప్రభుత్వ జీవోలపై ఆమెకు ఉన్న పట్టు అసాధారణమైనది.
అందుకే, డీఎస్సీ ప్రక్రియపై రాజకీయ బురదజల్లే ప్రయత్నం జరిగినప్పుడు ఆమె అస్సలు సహించలేదు. మీడియా ముందుకు వచ్చి.. ఏ జీవో ప్రకారం, ఏ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామో స్క్రీన్లపై లెక్కలతో సహా చూపించారు. అంతా ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ పద్ధతిలోనే జరిగిందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే మనం చేసే పనిలో పారదర్శకత ఉంటుందో.. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తమీమ్ అన్సారియా ఐఏఎస్ నిరూపించారు.














