తెలుగు రాజకీయాల్లో బూతులు అనగానే.. మొదట మనకు ఎవరు గుర్తొస్తారు..? ఇప్పుడంటే వైసీపీ అంటారు గానీ, ఒకప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ సాబే కదా..? అలాంటిది ఆయన చెప్తున్న కొన్ని నీతుల తర్వాత, ఇప్పుడు ‘భాష’ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. “ఆయన బూతులు మాట్లాడుతున్నారు.. అలాంటి సీఎం ఉన్న అసెంబ్లీకి నేను రాను” అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఈ ‘అసెంబ్లీ బహిష్కరణ’ సెంటిమెంట్ వెనుక, భాషా పవిత్రత గురించిన సూక్తుల వెనుక ఉన్న అసలు చారిత్రక సత్యాలను, కొంచెం వెటకారపు కోణంలో విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష గురించి సుద్దులు చెప్తున్న గులాబీ శ్రేణులు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే అసలు విషయం అర్థమవుతుంది. తెలుగు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నుండి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు ఘాటైన పదజాలానికి, ప్రత్యర్థులపై విరుచుకుపడే ‘భాషా’ శైలికి ఆద్యుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నప్పుడు ప్రెస్‌మీట్లలోనూ, బహిరంగ సభల్లోనూ వాడిన కొన్ని పదాలు ఇప్పటికీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి.
“కాల్చి పారేస్తాం”, “తొక్క తీస్తాం”, “చెడ్డీలు ఊడదీసి కొడతాం” వంటి పదబంధాలతో పాటు ప్రతిపక్ష నేతలను ఏకవచనంతో సంబోధించడం కేసీఆర్ ట్రేడ్‌మార్క్ స్టైల్. నాటి అధికార మదంతో ప్రతిపక్షాలను చీల్చిచెండాడుతున్నప్పుడు అది ‘తెలంగాణ గంగిరెద్దుల భాష’ అని, ‘సహజసిద్ధమైన శైలి’ అని సమర్థించుకున్న నాటి అధికార పార్టీ మేధావులు.. ఇప్పుడు అదే సీటులో కూర్చున్న రేవంత్ రెడ్డి ‘అదే భాషలో, అదే యాసలో’ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తాము మాట్లాడితే అది ‘తెలంగాణ పౌరుషం’.. అవతలి వాడు మాట్లాడితే అది ‘బూతు పురాణం’ అనడం రాజకీయాల్లో డబుల్ స్టాండర్డ్స్‌కు పరాకాష్ట.
నిజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కొత్త భాషను కనిపెట్టలేదు. కేసీఆర్ స్కూల్ ఆఫ్ పొలిటికల్ లాంగ్వేజ్ నుండి నేర్చుకున్న పాఠాలనే ఇప్పుడు బీఆర్ఎస్‌పై ప్రయోగిస్తున్నారు. కేసీఆర్ ఏ ఏకవచన సంబోధనలనైతే అలవాటు చేశారో, రేవంత్ రెడ్డి దానికి మరికొంత ఘాటు దనాన్ని జోడించి ఎదురుదాడి చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు తాము చల్లిన విత్తనాలే ఇప్పుడు వృక్షాలై తమపైకే వస్తున్నాయని గ్రహించలేక బీఆర్ఎస్ నేతలు విలవిలలాడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అనుకుంటే.. కాలం మారినప్పుడు అవతలి వైపు నుండి కూడా అదే స్థాయి ప్రతిధ్వని వస్తుందనే కనీస లాజిక్‌ను నాటి పాలకులు మర్చిపోయారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి భాషను బూచిగా చూపిస్తూ అసెంబ్లీకి రానని కేసీఆర్ భీష్మించుకు కూర్చోవడం వెనుక అసలు కారణం ‘భాష’ కాదు.. అక్కడ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్‌ను ఫేస్ చేసే అంత పొలిటికల్ స్ట్రెంత్ లేకపోవడమేనని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.
అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నేతగా కూర్చోవాలి, అధికార పక్షం వేసే ప్రశ్నలకు, గత పదేళ్ల పాలనపై జరిగే చర్చలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి ‘ముఖ్యమంత్రి భాష బాలేదు’ అనే ఒక సాకు దొరికితే చాలు.. సేఫ్‌గా ఫార్మ్‌హౌస్‌లో కూర్చోవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అసెంబ్లీని శాసించిన నాయకుడు, ఇప్పుడు సభలో అడుగుపెట్టడానికి భయపడుతూ ఇలాంటి ‘నీతి సూత్రాలు’ వల్లించడం కేవలం మీడియా అటెన్షన్ కోసమేనని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, నాడు తాము పెంచి పోషించిన పొలిటికల్ లాంగ్వేజే ఈరోజు తమను అడ్డుకోవడానికి సరికొత్త ఆయుధంగా మారిందని బీఆర్ఎస్ అధినేత గ్రహిస్తే మంచిది.














