వెలుగొండ వండర్! 6 శాతం పెరిగిన కూటమి గ్రాఫ్..!

0
4

రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడుల కంటే, పది వేల కోట్లతో ఒక నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది. ప్రభుత్వానికి మంచి మైలేజి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, మనది వ్యవసాయ ప్రధానమైన సమాజం. నూటికి 80 మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి వున్నారు. వ్యవసాయానికి నీరే ప్రధానం. నీరుంటే ఆధునికవ్యవసాయ పద్దతులతో అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకే నీటి మీద రైతుకు అబ్సెషన్ వుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కూడా మొన్నామధ్య సీఈవో అనిపించుకోవడం కన్నా రైతు బాంధవుడనిపించుకోవడం బాగుందనడానికి కారణం వుంది.

రాష్ట్రంలో ప్రధానమైన రెండు ప్రాజెక్టులను ప్రారంభించిన తరువాత ప్రజల్లో వచ్చిన స్పందన చూసి, ఆయన ఆ మాటన్నారు. పెట్టుబడులు తేవడం చంద్రబాబుకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటి ఇండస్ట్రీని ప్రమోట్ చేశారు. విడిపోయాక రాష్ట్రానికి కియా లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. రాష్ట్రానికి పన్ను రూపంలో ఆదాయం కూడా వస్తుంది. ఈ పెట్టుబడులొచ్చినప్పుడు ప్రజల స్పందన కంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, నీరు విడుదల చేసినప్పుడు, పోలవరం ఎడమకాలువకు నీరు విడుదల చేసినప్పుడు ప్రజల స్పందన అద్భుతంగా వుంది. చంద్రబాబుని నీళ్లిచ్చిన దేవుడిలా భావించారు. సాగునీరంటే ఏంటో తెలియని పశ్చిమ ప్రకాశం వాసులు, ట్రాక్టర్లు, టూవీలర్ల మీద నల్లమలసాగర్ కు వెళ్లి కృష్ణా జలాలను చూసి పరవశించిపోతున్నారు. ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటున్నారు. తమ కలని చంద్రబాబు నిజం చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత ప్రజల స్పందన, కూటమి ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడొకరు వెలుగొండ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రజలు చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తారు. నాలుగు ప్రశ్నలతో క్లుప్తంగా జరిపిన ఈ సర్వేలో ఒక్కో మండలం నుంచి 500 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రధానంగా రైత్వారీ, రైతు కూలీ వర్గాల నుంచి సమాచారం సేకరించారు. 50 శాతం మహిళలు, 50 శాతం పురుషుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం గురించి అడిగిన ప్రశ్నకు ఇది చంద్రబాబు వల్లే సాధ్యమైందని మెజారిటీ ప్రజలు చెప్పారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి అడిగినప్పుడు చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికని నెరవేర్చారని చెప్పారు. డిఎస్సీ మీద వైసిపి చేస్తున్న ఆరోపణలని ఎక్కువశాతం నమ్మడం లేదని చెప్పారు. ఓవరాల్ గా చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ప్రశ్నకు మెజారిటీ ప్రజలు ఆమోద ముద్ర వేశారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అన్ని మండలాలు, కనిగిరిలో హనుమంతునిపాడు, సిఎస్ పురం మండలాల్లో ఈ సర్వే చేశారు. ఈ సర్వే ప్రకారం గత ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతానికి ఆరు నుంచి ఏడు శాతం కూటమికి గ్రాఫ్ పెరిగింది.

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపి గెలిచింది. ఇక్కడ వైసిపికి 49.4 శాతం ఓట్లు వస్తే, టిడిపికి 46.6 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వెలుగొండ ప్రారంభించిన తరువాత చేసిన సర్వేలో కూటమి గ్రాఫ్ 6 శాతం పెరిగింది. సర్వేలో పాల్గొన్నవాళ్లలో 55 శాతం ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపికి 51.8 శాతం ఓట్లు వచ్చాయి. వైసిపికి 44.5 శాతం ఓట్లు వచ్చాయి. తాజా సర్వేలో 7 శాతం మొగ్గు కనపడింది. ప్రభుత్వ గ్రాఫ్ 59 శాతానికి పెరిగింది. కనిగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలుంటే రెండు మండలాల్లో సర్వే నిర్వహించారు. ఇక్కడ కూడా దాదాపు 6 శాతం మొగ్గు కనిపించింది. కనిగిరిలో గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి 51.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అది 58 శాతానికి పెరిగింది.

ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించిన తరువాత జనంలో వచ్చిన విపరీతమైన రెస్పాన్స్ చూసిన తరువాత, ఆ ఎంపీ అసలు ప్రజల నాడి ఎలా వుందో తెలుసుకోడానిక ఈ మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా వుంటుంది. వైసిపికి స్ట్రాంగ్ హోల్డ్ వున్న సెగ్మెంట్లు. అలాంటి చోట వెలుగొండ జలాలు తెచ్చిన మార్పు ఇది. పది లక్షలకోట్ల పరిశ్రమల కంటే పదివేల కోట్ల సాగు ప్రాజెక్టులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయని. రాబోయే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు, పెండింగ్ లో వున్న ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.