ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పోలీసుల పనితీరుపై, శాంతిభద్రతల పరిరక్షణపై పదేపదే కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో తక్షణమే స్పందించాలని స్పష్టం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు పోలీసుల అహంకారపూరిత వైఖరి మారలేదని చెప్పడానికి గుంటూరులో జరిగిన తాజా ఘటనే నిదర్శనంగా నిలిచింది. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే పట్టించుకోని పోలీసులు.. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగితేనే స్పందిస్తారా..? అనే చర్చ ఇప్పుడు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేకెత్తుతోంది.
అసలు కథనంలోకి వెళ్తే.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధికి చెందిన ‘రిజ్వానా’ అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నరకయాతన అనుభవిస్తోంది. ఆమె భర్త ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగి వచ్చి, ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా, తాగి వచ్చి తనను, తన పిల్లలను చంపేస్తానని కత్తితో బెదిరిస్తున్నాడంటూ ఆమె ప్రాణభయంతో వణికిపోయింది. పైగా, ఆ నిందితుడైన భర్తపై ఇప్పటికే ఒక భయంకరమైన పోక్సో కేసు కూడా నమోదై ఉంది. అయినా సరే అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా, రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
అయితే, అక్కడి పోలీసులు ఆమె ఫిర్యాదును కనీసం స్వీకరించకుండా.. “నీ వెనుక ఎవరైనా పెద్ద మనుషులను లేదా రికమండేషన్ ఉన్నవారిని తీసుకువస్తేనే కేసు నమోదు చేస్తాం” అంటూ అత్యంత దారుణంగా సమాధానం చెప్పి పంపించేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన సదరు బాధితురాలు.. చివరకు గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. తనను, తన పిల్లలను ఆ కిరాతకుడి నుండి కాపాడాలని కన్నీరు పెట్టుకుంది. సామాన్య మహిళ పట్ల పోలీసుల ప్రవర్తనను విన్న ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే పోలీసులు స్పందిస్తారు.
కానీ, రికమండేషన్ ఉంటేనే న్యాయం చేస్తామన్న పోలీసుల వ్యవస్థీకృత నిర్లక్ష్యాన్ని కళ్లారా చూడటానికి గల్లా మాధవి స్వయంగా బాధితురాలిని, ఆమె పిల్లలను వెంటబెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్‌లో పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎమ్మెల్యే.. “ఎవరో పెద్ద మనుషులు వస్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పారంట కదా. ఇదిగో బాధితురాలి తరఫున నేనే నేరుగా వచ్చాను.. ఇప్పుడు కేసు నమోదు చేయండి” అంటూ పోలీసులను నిలదీశారు.
ఎమ్మెల్యే స్వయంగా వచ్చి నిలదీసేసరికి ఒక్కసారిగా ఖంగుతిన్న పోలీసులు.. వెనక్కు తగ్గి వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యల ప్రక్రియను ప్రారంభించారు. బాధితురాలితో పాటు ఆమె ఇద్దరు పిల్లలకు తక్షణమే పూర్తి రక్షణ కల్పించాలని గల్లా మాధవి పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే జోక్యంతో గుంటూరు పోలీసుల అసలు పనితీరు ఏంటో బహిర్గతమవ్వడం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాన్యుడికి చట్టం రక్షణ కల్పించాలంటే ఎల్లప్పుడూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలా..? రికమండేషన్ లేని నిరుపేదలకు ఈ వ్యవస్థలో న్యాయం దక్కదా..? అని గుంటూరు ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.














