ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ పోరు పేరుతో సరికొత్త మైండ్ గేమ్‌కు తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల విధుల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఏకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు 54 మంది పోలీస్ ఆఫీసర్ల జాబితాను వైసీపీ సిద్ధం చేయడం.. వారిపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందనే విమర్శలు వస్తున్నాయి.
కోర్టుల పేరు చెప్పి క్షేత్రస్థాయిలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులను మానసికంగా ఒత్తిడికి గురిచేయడం లేదా భయపెట్టడం ద్వారా ఎన్నికల వేళ అనుకూల వాతావరణం సృష్టించుకునేందుకే ఈ ‘బెదిరింపు ప్లాన్’ అమల్లోకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం సహజం. అయితే, నామినేషన్ల కేంద్రాల వద్ద జరిగిన అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించిన ప్రతి చోటా.. వారు టీడీపీకి సహకరిస్తున్నారంటూ ముద్ర వేయడం ద్వారా పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ చూస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా క్షేత్రస్థాయి అధికారులను ఒక రకమైన ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యేలా లాక్ చేయడమే ఈ 54 మంది అధికారుల లిస్టు వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 19 మున్సిపాలిటీల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంత ఊరట పొందిన వైసీపీ.. ఇప్పుడు ఏకంగా పోలీస్ యంత్రాంగాన్నే టార్గెట్ చేస్తూ లీగల్ అడుగులు వేయడం సంచలనంగా మారింది.
అయితే, నిజంగానే పోలీసుల తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నప్పటికీ, నేరుగా 54 మంది అధికారుల పేర్లను బయటకు తెచ్చి సుప్రీంకోర్టుకు వెళ్తామనడం వెనుక కేవలం రాజకీయ లబ్ధి మరియు అధికారులపై ఒత్తిడి తేవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని కూటమి శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఈ తాజా లీగల్ బెదిరింపుల వ్యూహం ఏపీ పోలీస్ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.














