దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అత్యంత పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) లో తీవ్ర కలకలం రేగింది. బ్యాంక్‌కు చెందిన ఇద్దరు అత్యంత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు సంబంధించిన రహస్య వ్యాపార వ్యూహాలను, మార్కెట్ సెన్సిటివ్ సమాచారాన్ని బయటి వ్యక్తులకు లీక్ చేసినట్లు బ్యాంక్ జరిపిన అంతర్గత విచారణలో ఆధారాలతో సహా తేలింది. బ్యాంక్‌లోని కొన్ని కీలక విభాగాలను పర్యవేక్షిస్తున్న ఈ ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకంపై మేనేజ్మెంట్, బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంక్ ఉన్నత స్థాయి వర్గాల్లో సమాచారం లీక్ అవుతోందనే అనుమానాలు రావడంతో ఈ ఏడాది ఆరంభంలోనే యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. లీకేజీ నిజమేనని తేలడంతో సదరు అధికారులకు ఇప్పటికే మెమోలు జారీ చేశారు. అయితే, ఈ లీకైన సమాచారాన్ని బయటి వ్యక్తులు మార్కెట్లో ఏదైనా తప్పుడు ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారా? అనే కోణంలో ప్రస్తుతం బ్యాంక్ మరిన్ని లోతైన పరిశోధనలు చేస్తోంది. ఈ లీకేజీ వ్యవహారాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధి ఒకరు ధృవీకరిస్తూ.. నిజానిజాలను పూర్తిగా నిరూపించి, విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత మూడు దశాబ్దాలుగా పటిష్టమైన అంతర్గత నియంత్రణలు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ ఏడాది ఇప్పటికే ఈ బ్యాంక్ షేర్లు సుమారు 28 శాతం వరకు నష్టపోయాయి. వీటికి తోడు అక్టోబర్ 27న బ్యాంక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఐసీఐసీఐ గ్రూప్ మాజీ సీనియర్ నేత అనూప్ బాగ్చీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈఓ శశిధర్ జగదీశన్ పదవీకాలాన్ని పొడిగించుకోవద్దని నిర్ణయించుకోవడం, అలాగే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా డిసెంబర్లో తప్పుకోనుండటం లాంటి కీలక లీడర్షిప్ మార్పుల తరుణంలో ఈ డేటా లీక్ స్కామ్ బయటపడటం కొత్త సీఈఓ బాగ్చీకి పెద్ద సవాలుగా మారనుంది.














