విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి ఆత్మీయ కలయిక సమావేశంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురై వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. ఆయన మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇటీవల వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో, రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు రావడంతో బొత్స ఒక్కసారిగా బోరున విలపించారు.
సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రసంగిస్తున్న సమయంలో ఈ భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మజ్జి శ్రీనుతో కలిసి తామంతా నడిచిన రోజులను, ఆయనతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని కార్యకర్తలు గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మజ్జి శ్రీనుకు అంతటి ప్రాధాన్యత పెరగడానికి, ఏ చిన్న పని ఉన్నా కార్యకర్తలను ఆయన దగ్గరకు పంపడానికి బొత్స సత్యనారాయణే కారణమని వారు సభలో ప్రస్తావించారు. నమ్మిన వాళ్లే ఇలా కష్టకాలంలో మోసం చేసి వెళ్లిపోవడంపై కేడర్ వ్యక్తపరిచిన ఆవేదనను వింటూ బొత్స తీవ్రంగా చలించిపోయి కన్నీరు కార్చారు.
బొత్స సత్యనారాయణ వేదికపై వెక్కివెక్కి ఏడుస్తుండటంతో అక్కడ ఉన్న నాయకులు, ఆయన కుమార్తె బొత్స అనూష వెంటనే ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. బొత్స కన్నీటి పర్యంతమవడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం, విషాద వాతావరణం నెలకొంది. అనంతరం కొంతసేపటికి తేరుకున్న బొత్స సత్యనారాయణ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు కానీ పార్టీ మాత్రమే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుని నిలబడే ఇలాంటి నిజాయితీ గల కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అత్యంత పట్టున్న సీనియర్ నాయకుడు ఇలా బహిరంగంగా కన్నీరు పెట్టుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.













