తిరుమల శ్రీవారి భక్తుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం దేశ చరిత్రలోనే నిలిచిపోయే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. పవిత్ర తిరుమల కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షలో భక్తుల కోసం సరికొత్త ఉచిత బీమా పథకాన్ని ప్రకటించారు. భారతదేశంలోని ఏ దేవాలయంలోనూ లేని విధంగా.. తిరుమలలో అడుగుపెట్టే ప్రతి ఒక్క భక్తుడికీ రక్షణ కల్పించేలా ఈ సరికొత్త విప్లవాత్మక నిబంధనలను తీసుకొచ్చారు.
సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇస్తాయి. కానీ, ఇప్పుడు టీటీడీ తెచ్చిన కొత్త రూల్ కాస్త భిన్నంగా ఉంటుంది. మన దేశంలోని ప్రసిద్ధ క్షేత్రాలైన జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి, కేరళలోని శబరిమల, అమర్‌నాథ్ శ్రైన్ బోర్డులు కూడా తమ భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఆయా దేవాలయాల బోర్డులు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు, తొక్కిసలాటలకు మాత్రమే బీమా డబ్బులు చెల్లిస్తాయి.
కానీ మన తిరుమల కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెచ్చిన సరికొత్త మార్పు ఏంటంటే.. అలిపిరి టోల్‌ప్లాజా దాటినప్పటి నుండి కొండపైకి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని తిరిగి కిందకు వచ్చే లోపు భక్తుడికి గుండెపోటు లాంటి ఏ రకమైన సహజ మరణం సంభవించినా సరే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఈ విధంగా సహజ మరణాలకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించడం హిందూ దేవాలయాల చరిత్రలోనే మొట్టమొదటి వినూత్న ప్రయోగం. ప్రతి భక్తుడి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా ఈ ఆన్‌లైన్ ఉచిత బీమాను ఎల్‌ఐసి సంస్థ ద్వారా వర్తింపజేస్తారు.














