హైదరాబాద్ మహానగరంలోని ఐటీ హబ్ మాదాపూర్ ప్రాంతంలో రూ. కోట్ల విలువైన భూమికి సంబంధించిన వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రముఖ సెఫాలజిస్ట్, ‘ఆరా’ పోలింగ్ సర్వేల అధినేతగా గుర్తింపు పొందిన ఆరా మస్తాన్‌పై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. నకిలీ పత్రాలు సృష్టించి మాదాపూర్‌లోని అత్యంత విలువైన స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆరా మస్తాన్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వివాదాస్పద భూమికి సంబంధించిన అసలు పత్రాలు ఏమిటి, జీహెచ్‌ఎంసీ నుండి అనుమతులు పొందేందుకు సమర్పించిన ఆధారాలు ఎంతవరకు నిజమైనవి అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఫోర్జరీ పత్రాల వెనుక ఎవరెవరి హస్తం ఉందనే విషయాలపై విచారణ ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, గతంలో తెలంగాణలో జరిగిన హైప్రొఫైల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సైతం ఆరా మస్తాన్‌ను సిట్ కీలక సాక్షిగా సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. తాజా భూ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆరా మస్తాన్ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర విమర్శలపాలయ్యాయి. ఏపీలో మళ్లీ ‘వైసీపీదే స్పష్టమైన అధికారం’ అంటూ ఆయన అప్పట్లో ఘంటాపథంగా జోస్యం చెప్పారు. తుది ఫలితాలు వచ్చేసరికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనాటి తప్పుడు సర్వేల టైమ్ నుండి కూటమి శ్రేణుల టార్గెట్‌లో ఉన్న ఆరా మస్తాన్.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఫేక్ డాక్యుమెంట్ల భూకబ్జా కేసులో ఇరుక్కోవడంతో నెటిజన్లు ఆయన పాత సర్వేలను తవ్వుతూ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.














