రాజకీయ నాయకుడు అంటే కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చేవాడేనా..? లేక అధికారం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాడా..? ఈ పాత రసాయనిక సూత్రాలను బద్దలు కొడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ విషాదం జరిగినా, ఎవరైనా ప్రముఖులు లేదా సాధారణ కార్యకర్తలు మరణించినా.. ఆయన వెళ్తున్న తీరు, బాధితులను పరామర్శిస్తున్న శైలి అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆయన “పార్టీ పరంగా చూసుకుంటాం” అని కాకుండా, “వ్యక్తిగతంగా నేను ఉన్నాను.. మీకు ఏ కష్టం వచ్చినా నేనే పెద్దన్నలా నిలబడతా” అంటూ ఇస్తున్న భరోసా ప్రజల్లో తీవ్రమైన ప్రశంసలను అందుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణే.. గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయాన్ని లోకేష్ సందర్శించిన తీరు. రాజకీయాల్లో ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కువగా టీడీపీకి దూరంగానే ఉన్నారు.
2024 ఎన్నికల తర్వాతే టీడీపీలో జాయిన్ అయ్యారు. కానీ అవేం పట్టించుకోని లోకేష్, ఆయన మరణవార్త వినగానే ఏలూరులోని ఆయన నివాసానికి స్వయంగా తరలివెళ్లారు. నాని పార్థివదేహానికి నివాళులర్పించడమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో లోకేష్ అన్న మాటలు అక్కడున్న వారిని కదిలించాయి. “రాజకీయాలు వేరు.. హుందాతనం వేరు. ఆళ్ల నాని కుటుంబానికి ప్రభుత్వం తరఫునే కాకుండా, వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు.
ఇంతటి ఆత్మీయమైన వ్యక్తిగత హామీ ఇవ్వడం లోకేష్‌లోని రాజకీయ హుందాతనాన్ని, పరిణతిని స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఒక ఆళ్ల నాని విషయానికే పరిమితం కాలేదు. గతంలో అమెరికాలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక ఆంధ్ర యువకుడు ఆత్మహత్య చేసుకున్న తరుణంలో, సదరు కుటుంబానికి లోకేష్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి తన సొంత టీంను రంగంలోకి దించి అండగా నిలిచారు.
అలాగే, చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో మరణించిన డిప్యూటీ సర్పంచ్ రాకేష్ చౌదరి కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకుని, ఆ కుటుంబ భవిష్యత్తు బాధ్యతను వ్యక్తిగతంగా తానే స్వీకరిస్తానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సాధారణ ప్రజలు తమ కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి ట్వీట్ చేసినా, “నేనున్నాను.. నా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది, ధైర్యంగా ఉండండి” అంటూ ఒక పెద్దన్నలా స్పందిస్తూ ఎన్నో కుటుంబాలకు ఆర్థిక, వైద్య సహాయం అందిస్తున్నారు.














