గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల అధికార కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు ఎదుర్కొన్న అరాచకాలు, దాడులు అంతా ఇంతా కాదు. నాడు అధికార మదంతో రెచ్చిపోయిన వైసీపీ మూకలు ఏకంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై పగటిపూటే దాడికి తెగబడ్డారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు నివాసంపైకి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో టీడీపీ కార్యాలయాలపైకి వైసీపీ గూండాలు దండయాత్రలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని, చట్టం తమ చేతుల్లో ఉంది కదా అని వారు చేసిన అరాచకాలను చూసి కూడా ఏ ఒక్కరూ మాట్లాడలేని, ప్రశ్నించలేని ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించారు.
కట్ చేస్తే.. నేడు రాష్ట్రంలో ప్రజా తీర్పుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ విజయవాడ నడిబొడ్డున వైసీపీ శ్రేణుల రౌడీయిజం ఇంకా తగ్గకపోవడం గమనార్హం. ఎంతో కష్టపడి మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించుకున్న అమాయక ఉపాధ్యాయులను, మహిళలను నడిరోడ్డుపై బూతులు తిడుతూ, భౌతిక దాడులకు తెగబడుతుంటే.. ప్రభుత్వం ఇంకా కేవలం “క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, సీసీ ఫుటేజ్ చూసి వార్నింగ్‌లు ఇస్తాం” అంటూ కాలయాపన చేయడంపై టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాడు పార్టీ కోసం రక్తం చిందించి, కేసులు ఎదుర్కొన్న తమ్ముళ్ల రక్తం ఇప్పుడు మరిగిపోతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారారు కానీ, వైసీపీ అరాచక శక్తులకు చట్టం అన్నా, కోర్టులు అన్నా, పోలీసులు అన్నా ఇంకా భయం లేకుండా పోయిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పోలీసులు అక్కడే ఉన్నా, ప్రభుత్వ కార్యాలయాల ముందే దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు తక్షణమే ఉక్కుపాదం మోపకపోవడంపై కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి అరాచక మూకలపై కేవలం హెచ్చరికలతో కాలం వెళ్లదీయకుండా, నాడు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వారితో సహా నేడు ఉపాధ్యాయులపై చేయి చేసుకున్న ప్రతి ఒక్క వైసీపీ గూండాను కఠినంగా జైలుకు పంపాలని, అప్పుడే ప్రభుత్వానికి, పోలీసులకు నిజమైన గౌరవం దక్కుతుందని ప్రజలు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.














