తెలంగాణలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అని ఒకాయన చంద్రబాబు వల్ల వానలు పడట్లేదని చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టి చెప్పాడు. ఇతను 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. అందుకే జగన్ ఫాలోయర్ అనొచ్చు. జగన్ ఫాలోయర్స్ ని ఏమంటారో మీకు తెలుసు కదా. అలాంటోడే ఇతను. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడైన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతనికి గురువు. ఇతను కాంగ్రెస్ లో చేరినా వైసిపి వాసనలు పోలేదు. అందుకే పదే పదే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీద విమర్శలు చేస్తుంటాడు.
కొన్నిసార్లు బిఆర్ఎస్ నాయకుడిలాగా ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా ప్రజల మీద కూడా నోరు పారేసుకుంటాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎంతో సత్సంబంధాలుంటాయి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్తుంటాడు. అదే పార్టీలో వున్న అనిరుధ్ రెడ్డి మాత్రం రెచ్చిపోతుంటాడు. కాంగ్రెస్ పార్టీలో వున్న బ్యూటీ అదే. ముఖ్యమంత్రి మాట మంత్రులు వినరు. మంత్రులని ఎమ్మెల్యేలు లెక్క చెయ్యరు. అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతూ వుంటుంది. అందుకే జాతీయ స్థాయిలో కుదేలయింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి పుణ్యం అనుకోవాలి. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో వున్నతెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్నొక మీటింగు లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం వల్ల తెలంగాణలో వర్షాలు పడటం లేదని నోరు పారేసుకున్నాడు.
గత రెండేళ్లు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు వల్ల బంగాళాఖాతం నుంచి వాయుగుండాలు ఏపీ దాటి తెలంగాణ వైపుకు రావడం లేదంటున్నారు. మరి గత రెండేళ్లుగా చంద్రబాబే ఏపీసీఎంగా వున్నారు. రేవంత్, చంద్రబాబుఆరు నెలల తేడాతో సీఎంలు అయ్యారు. అసలు వర్షాలు తెచ్చే నైరుతి రుతుపవనాలు కేరళ వైపు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఆంధ్రాకి వస్తాయనే విషయం ఇతనికి తెలియదేమో. అయినా దేశంలో మూడొంతుల రాష్ట్రాలు ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దానికి కూడా చంద్రబాబే కారణమా? జగన్ రెడ్డి సీఎం అయిన వెంటనే కరోనా వచ్చింది.
ప్రపంచమే విలవిల్లాడింది. మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది చనిపోయారు. దానికి జగన్ రెడ్డికి ఎవరూ ముడిపెట్టలేదే? అయినా వ్యక్తులని బట్టి వర్షాలు వ్యాధులు వస్తాయని జ్నానం లేని మూర్ఖులు చెప్పొచ్చు కానీ, చదువుకుని, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నవ్యక్తి చెప్పడం, అదీ బహిరంగంగా సభలో చెప్పడం అతనిలో వున్న వ్యక్తిగత ద్వేషానికి నిదర్శనం. ఇతనికి ప్రాంతీయ ద్వేషం కూడా మెండుగానే వుంది. గతంలో 2024 అక్టోబరులో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకు అనుకుంటా, తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకొచ్చి మీడియా ముందు రాజకీయ విమర్శలు చేశారు.
తిరుమల కొండ మీద రాజకీయ విమర్శలు చెయ్యకూడదన్న నిబంధనని వైసిపి అధికారంలో వున్నఅయిదేళ్లు పాతరేసింది. ఇతను అదే క్లాన్ కాబట్టి అక్కడ రాజకీయ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిపార్సు లేఖలు టిటిడి తీసుకోవడం లేదని, చంద్రబాబు ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివన్నాడు, మరి ఒక కన్ను పీకేసుకున్నారా అని ప్రశ్నించారు. ఇలాగే చేస్తే తెలంగాణ అసెంబ్లీలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. ఏపీ వాళ్లు హైదరాబాద్ లో బిజినెస్ లుచేసుకుంటున్నారు. మమ్మల్ని ఇబ్బందిపెడితే ఏపీ వాళ్లని తెలంగాణకు రావద్దని మేం నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. “కృష్ణా జలాలు తెలంగాణ నుంచే ఏపీకి వెళ్తున్నాయి” అది గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిదులకు తిరుమలలో గౌరవం ఇవ్వకపోతే ఏపీ నాయయకులు, ప్రజలు తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వుంటుందని హెచ్చరించారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వారానికి రెండు రోజులు సోమ, మంగళవారాలు బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించారు. అలాగే బుధ గురువారాలు వాళ్ల లెటర్స్ తో 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడిగా వున్నప్పటిలాగేనే ఇవ్వాలనడం సమంజసంకాదు.
తెలంగాణ తరహాలోనే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఈ అవకాశం లేదు. తిరుమలలో వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలు చేసిన తరువాత ఈ అనిరుధ్ రెడ్డి 2025 జులైలో మరొకసారి చంద్రబాబు మీద నోరు పారేసుకున్నాడు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారని, వాళ్లకి ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు ఇస్తున్నారని, వాళ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శలుచేశారు.
వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వకూడదని, బిల్లులు చెల్లించకూడదని, వాళ్లకు కరెంటు, నీటి కనెక్షన్లుకట్ చెయ్యాలని, అప్పుడు వాళ్లు చంద్రబాబు దగ్గరకెళ్లి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆపమని చంద్రబాబుని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఇంకా తీవ్రమైన వ్యాఖ్య ఏంటేంటే ఆంధ్రోళ్లకుమంచిగా చెప్తే వినరన్నారు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇతన్ని మందలించలేదు. వివరణ అడగలేదు. దీంతో అదే ధోరణిలో రెచ్చిపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కూడా వదల్లేదు. జనసేన తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తే వూరుకోమన్నారు.
పవన్ కు చంద్రబాబు ప్రొడ్యూసర్ అని విమర్శలు చేశారు. ఇప్పుడేమో తాజాగా చంద్రబాబు వల్ల వానలు పడటం లేదని వైసిపి స్క్రిప్టుని వల్లె వేస్తున్నాడు. ఇతనిలో ఒక జఫ్పా, ఒక ప్రాంతీయోన్మాది కనిపిస్తున్నాడు.నిజానికి ఇతనికి బిఆర్ఎస్ పార్టీ సూటవుతుంది. ప్రాంతీయవిద్వేషాలు రెచ్చగొట్టే సిలబస్ బిఆర్ఎస్ ది కాబట్టి ఆ పార్టీయే అతనికి సూటవుతుంది. తన పార్టీ ఎమ్మెల్యే, తన సొంత జిల్లా ఎమ్మెల్యే చంద్రబాబు మీద ఇలాంటివ్యాఖ్యలు చేస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తూ మౌనంగా వుండటం ఏంటన్న ప్రశ్న సందేహం సగటు ఆంధ్రుడిలో వుంటుంది.
కానీ ఇతన్ని రేవంత్ మందలిస్తే అతని మీద చంద్రబాబు ముద్ర వెయ్యడానికి బిఆర్ఎస్, కాంగ్రెస్ లో రేవంత్ ప్రత్యర్థులు సిద్ధంగా వుంటారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లయింది. ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారు. ఇంకా ఏపీ మీద పడి ఏడవడం, చంద్రబాబు మీద ఏడవడం మానుకోకపోవడాన్ని పాథలాజికల్ జెలసీ అంటారు. విపరీతమైన అసూయ, ద్వేషం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో కొంతమంది నాయకులకు ఈ జబ్బుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో, రాష్ట్రం విడిపోయిన తరువాత బిఆర్ఎస్ వాళ్లకు ఈజబ్బు వుండేది.
ఏం జరిగిన చంద్రబాబే కారణం అని చెప్తుండేవారు. చివరకు వీళ్ల ఇళ్లలో ఏం జరిగినా కూడా దానికి చంద్రబాబే కారణమంటారేమో అని వీళ్ల మీద జోకులేసుకున్న సందర్భాలున్నాయి. చంద్రబాబు నామస్మరణ చెయ్యందే వీళ్లకి నిద్ర పట్టదు. హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణ వచ్చింది. చక్కగా పరిపాలించుకోక ఇంకా చంద్రబాబు మీద ఏడుపులెందుకు.వాస్తవానికి అన్యాయంగా జరిగిన విభజనవల్లనష్టపోయిన ఏపీ ప్రజలు ఏడవాలి తెలంగాణ మీద. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇప్పుడు అనిరుధ్ రెడ్డి అదే కోవలో పదే పదే నోటికి పనిచెప్తున్నారు. కొసమెరుపేంటంటే ఈయన బంధుత్వాలన్నీ ఏపీతోనే. ఈయన తల్లి గారిదినెల్లూరు జిల్లా. ఆ జిల్లా వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి ఇతను బంధువు అవతాడు.














