బెజవాడ రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలిచిన నాయకుడిగా దేవినేని నెహ్రూకు గొప్ప పేరుంది. ఆయన తన కుమారుడు దేవినేని అవినాష్‌కు లండన్‌లో అత్యున్నత చదువులు చదివించి, ఒక విద్యావంతుడిగా సమాజంలో మంచి గౌరవప్రదమైన భవిష్యత్తును అందించాలని ఆరాతపడటమే కాకుండా.. వారసత్వాన్ని నిలబెట్టే క్రమంలోనే నెహ్రూ తన చివరి రోజుల్లో.. కుమారుడిని తెలుగుదేశం పార్టీలో చేర్పించి రాజకీయ ఓనమాలు నేర్పించారు. లండన్ రిటర్న్ గ్రాడ్యుయేట్ అయిన అవినాష్‌కు టీడీపీ అధిష్ఠానం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, యువ నాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘తెలుగు యువత’ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడమే కాకుండా, రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ అవుతాడనే నమ్మకంతో ఏకంగా గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ సీటును సైతం కేటాయించి రాజకీయంగా నీరాజనాలు పట్టింది. అయితే కన్నతండ్రి ఆశయాలను, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అపారమైన గౌరవాన్ని విస్మరించి, కేవలం తాత్కాలిక అధికార ప్రలోభాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే అవినాష్ రాజకీయ పతనం ప్రారంభమైందని దేవినేని కుటుంబ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక పరిస్థితులతో ఎన్నో ఇబ్బందులు పడ్డ దేవినేని నెహ్రూ.. తన కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో టీడీపీలో జాయిన్ చేస్తే.. 2019 ఎన్నికల్లో ఓటమితో.. వైకాపాలోని నేరపూరిత సంస్కృతికి అలవాటు పడి, తాను చదువుకున్న చదువును, సంస్కారాన్ని పూర్తిగా మరిచిపోయారు అవినాష్. కరుడుగట్టిన రౌడీ మూకల తరహాలో రోడ్ల మీద తిరుగుతూ అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అప్పట్లో అధికార మదంతో ప్రతిపక్ష కార్యాలయాలపై దాడులకు తెగబడటం, సామాన్య ప్రజలను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే ముఠాలకు నాయకత్వం వహించడంతో రాజకీయ జీవితం పూర్తిగా పక్కదారి పట్టింది.
తాజాగా విజయవాడలో మెగా డీఎస్సీ నిరుద్యోగ ఉపాధ్యాయులపై జరిగిన అమానుష భౌతిక దాడి కేసు మరియు గతంలో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన హింసాత్మక అల్లర్ల ఉదంతంతో అవినాష్ అసలు స్వరూపం బయటపడింది. ఈ హింసాత్మక సంఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, దేవినేని అవినాష్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అధికారికంగా కఠిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకప్పుడు రాష్ట్రస్థాయి యువజన విభాగానికి అధ్యక్షుడిగా, లండన్ చదువుల విద్యావంతుడిగా సమాజంలో అపారమైన గౌరవం పొందిన వ్యక్తి, నేడు వైకాపా అరాచక రాజకీయాల దెబ్బకు పోలీస్ రికార్డుల్లో ఏకంగా రౌడీగా ముద్ర వేయించుకోవడం బెజవాడ చరిత్రలోనే ఒక బ్లాక్ మార్క్‌గా నిలిచిపోయింది. తప్పుడు నిర్ణయాలు, నేరపూరిత శక్తులతో సహవాసం కారణంగా దేవినేని నెహ్రూ జీవితాంతం సంపాదించిన పేరును బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ, అవినాష్ తన రాజకీయ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.














