తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను భారీగా పెంచేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో టికెట్ కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీలో సరికొత్త అంతర్గత సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.
పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దానం నాగేందర్ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఉంచినట్లు టాక్ నడుస్తోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అయ్యే మొత్తం ఎన్నికల ఖర్చును, పెట్టుబడిని తానే స్వయంగా భరించుకుంటానని, పార్టీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూసుకుంటానని దానం నాగేందర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తనకున్న బలమైన క్యాడర్, ఆర్థిక వనరులను పూర్తిగా వినియోగించి పార్టీని గెలిపించుకుంటానని, అందువల్ల ఖైరతాబాద్ సీటును తనకే కేటాయించాలని ఆయన సిఎం రేవంత్ రెడ్డిని గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగడం ద్వారా తన పట్టు నిలుపుకోవాలని ఆయన భావిస్తున్నారు. తన సొంత పెట్టుబడితోనే ఎన్నికల బరిలోకి దిగుతానని దానం ఆఫర్ ఇవ్వడం వెనుక, టికెట్ రేసులో ఇతరుల నుంచి ఎలాంటి పోటీ లేకుండా ముందస్తుగానే సీటును కన్ఫర్మ్ చేసుకోవాలనే వ్యూహం ఉందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దానం నాగేందర్ చేసిన ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.














