కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గ నేతగా, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడిగా మంచి పట్టున్న యనమల కృష్ణుడు వైసీపీకి రాజీనామా చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణుడికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
తుని నియోజకవర్గంలో వైసీపీకి ఇది వరుసగా తగులుతున్న రెండో అతిపెద్ద షాక్. ఇటీవలే ఆ పార్టీ కీలక నేత వరుపుల సుబ్బారావు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి తప్పుకున్న సంగతి తెలిసిందే. వరుపుల సుబ్బారావు నిష్క్రమణతోనే తునిలో వైసీపీ డిఫెన్స్‌లో పడగా.. ఇప్పుడు యనమల కృష్ణుడు కూడా తోడవడంతో నియోజకవర్గంలో వైసీపీ కేడర్ పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. వరుపుల, యనమల కృష్ణుడు ఇద్దరూ తుని రాజకీయాలను శాసించగల సామాజిక సమీకరణాలు, కేడర్ బలం ఉన్న నేతలు కావడంతో.. వీరిద్దరి రాజీనామాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బగా మారాయి.
యనమల కృష్ణుడు గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వైసీపీలో చేరారు. అయితే, ఎన్నికల తర్వాత మారుతున్న ఏపీ రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయిలో వైసీపీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన మళ్లీ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో అత్యంత యాక్టివ్‌గా ఉంటూ, కాపు సామాజికవర్గంతో పాటు యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్న జనసేన వైపు ఆయన మొగ్గు చూపారు. వరుపుల సుబ్బారావు, యనమల కృష్ణుడు వంటి ఇద్దరు బలమైన పిల్లర్లు దూరం కావడంతో తుని నియోజకవర్గంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






