ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల పరిధిలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం వారి కెరీర్ ఎదుగుదలకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అర్హులైన సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించేందుకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్టుల సర్దుబాటు ప్రక్రియ ద్వారా కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్ల ఛానల్ చైన్ సిస్టమ్ పద్ధతిలో సాగనుంది. నూతనంగా క్రియేట్ చేసిన 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల స్థానంలోకి.. ప్రస్తుతం విధుల్లో ఉన్న అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను భర్తీ చేస్తారు. ఆ విధంగా ఖాళీ అయ్యే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల స్థానాల్లోకి, ప్రస్తుతం పనిచేస్తున్న వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మరోవైపు నగరాల పరిధిలో పారిశుద్ధ్యం, భవనాల నిర్మాణ అనుమతుల విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కీలక పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో గ్రేడ్-II హోదాలో ఉన్న 815 వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ పోస్టులను, అలాగే 815 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్-I హోదాకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భారీ ప్రమోషన్ల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందే సేవలు మరింత వేగవంతం కావడమే కాకుండా, సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం రానుందని ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.














