దేశంలో కొత్త ఓటు హక్కు నమోదును క్లిష్టతరం చేసేలా ఇటీవల ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ప్రవేశపెట్టిన అదనపు ఆంక్షలపై రాజకీయ వర్గాలతో పాటు పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫారమ్-6 దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారుల తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలను పాత ఎస్ఐఆర్ జాబితాలతో మ్యాపింగ్ చేస్తూ అదనపు డిక్లరేషన్ అడగడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అదనపు ఆంక్షల వల్ల కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మందగించిందని, దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వచ్చిన విమర్శలకు ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఈ నిబంధనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా, ఎన్నికల కమిషనర్ల పూర్తి స్థాయి అనుమతి లేకుండానే ఈ ‘SIR డిక్లరేషన్’ ఫీల్డ్స్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లోకి తీసుకురావడంపై ఈసీ అంతర్గత వర్గాల్లోనే తీవ్ర చర్చ నడిచింది. అయితే, కేవలం ఐటీ విభాగం చేసిన టెక్నికల్ అప్‌డేట్ వల్లే ఈ అదనపు నిబంధనలు దరఖాస్తుదారులకు కనిపించాయని సమర్థించుకున్న అధికారులు, విమర్శలు ముదరడంతో వెంటనే రంగంలోకి దిగి ఆ ఫీల్డ్స్‌ను పోర్టల్ నుండి తొలగించారు. ఈ నిర్ణయంతో ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లోని కొత్త ఓటర్లకు పెద్ద ఊరట లభించింది.
ఈ విమర్శల అనంతరం దిగివచ్చిన ఎన్నికల సంఘం నిర్ణయంతో.. నూతన దరఖాస్తుదారులు ఇకపై ఎలాంటి అదనపు నిబంధనలు లేదా పూర్వీకుల లింకేజ్ సర్టిఫికెట్లు లేకుండానే సాధారణ ఫారమ్-6 ద్వారా ఓటు హక్కు కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఇంకా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రం ఈ నిబంధన తాత్కాలికంగా ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఏదేమైనా, ఒక అనాలోచిత నిర్ణయంతో కొత్త ఓటర్లను ఇబ్బంది పెట్టిన ఈసీ, విమర్శల తాకిడికి వెనక్కు తగ్గడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.














