ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సరికొత్త అంతర్గత రాజకీయాలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా మెగా డీఎస్సీ ద్వారా భారీ ఎత్తున ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ కొత్తగా ఎంపికైన వేలాది మంది టీచర్లు, వారి కుటుంబాలు సహజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పూర్తి అండగా నిలుస్తున్నాయి. అయితే, ఇదే తరుణంలో గత వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో నియమితులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అకస్మాత్తుగా రోడ్లపైకి రావడం, విజయవాడలో భారీ నిరసనలకు దిగడం వెనుక విపక్ష పార్టీ పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తోందా..? అనే సరికొత్త అనుమానాలు, విశ్లేషణలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగుల్లో బలమైన నమ్మకాన్ని కల్పించడమే కాకుండా, తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల వైపు విజయవంతంగా అడుగులు వేస్తోంది. కొత్తగా నియమితులైన టీచర్లంతా ప్రభుత్వానికి అనుకూల ఓటు బ్యాంక్‌గా మారడం, సమాజంలో కూటమి గ్రాఫ్ పెరగడాన్ని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ జీర్ణించుకోలేకపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వస్తోన్న ఈ సానుకూలతను దెబ్బతీయాలంటే.. తమ హయాంలో చేరిన లక్షలాది మంది సచివాలయ ఉద్యోగులను అస్త్రంగా వాడుకోవడమే ఏకైక మార్గమని తాడేపల్లి పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ ధర్నాచౌక్ వేదికగా ఇటీవల అనుమతి లేకుండా జరిగిన ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమం వెనుక విపక్ష నేతల పరోక్ష ప్రోత్సాహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిల పేరుతో ఉద్యోగుల అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు నిరసనలకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. “సచివాలయ ఉద్యోగులు తిరగబడితే ప్రభుత్వం కూలిపోతుంది” అనే తరహాలో విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందిని ప్రభుత్వంపైకి ఉసిగొల్పేలా ఉన్నాయనే అనుమానాలు క్షేత్రస్థాయి నివేదికల ద్వారా బలపడుతున్నాయి.
అనుమతి లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిరసనల్లో కీలక పాత్ర పోషించిన దాదాపు 45 మంది సచివాలయ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటుతో పాటు చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. నిఘా వర్గాల నుంచి అందిన అంతర్గత నివేదిక ప్రకారం.. ఈ ఆందోళనల వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు..? వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉద్యోగులను ఎవరు ప్రభావితం చేశారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.














