ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వివాదం అత్యున్నత న్యాయస్థానానికి చేరనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు ప్రతిష్టాత్మక జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేయడంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ వర్గాలకు రాజకీయంగా పూర్తి న్యాయం చేయాలనే తమ విధానపరమైన నిర్ణయానికి కట్టుబడి.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్‌తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ముందడుగు వేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్ల కోటా సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలని, 59 శాతానికి మించకూడదని పేర్కొంటూ హైకోర్టు ప్రభుత్వ జీవోలను రద్దు చేయడమే కాకుండా.. వచ్చే 6 వారాల్లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసింది. అయితే, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించడంతో ఏపీ స్థానిక పోరులో సరికొత్త చట్టపరమైన యుద్ధం మొదలైంది. తాము బీసీల ప్రాతినిధ్యం కోసం పట్టుబడుతున్నామని, కోర్టుల్లో దీనిపై గట్టిగా వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండటంతో.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలపైనే ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉంది.














