Home రాజ నీతి విశాఖ సమ్మిట్‌కు రానా, జాంటీ రోడ్స్ మరి టాలీవుడ్ దిగ్గజాలు ఎక్కడ..?

విశాఖ సమ్మిట్‌కు రానా, జాంటీ రోడ్స్ మరి టాలీవుడ్ దిగ్గజాలు ఎక్కడ..?

0
5

విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా విశాఖకు తరలివచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వంటి అంతర్జాతీయ క్రీడా దిగ్గజాలు సైతం విశాఖ తీరాన్ని చూసి ముగ్ధులై, ఇక్కడ స్పోర్ట్స్, వెల్‌నెస్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చారు.

తెలుగు సినీ పరిశ్రమ తరఫున యువ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి ఈ సమ్మిట్‌లో పాల్గొని, విశాఖను ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే విషయంపై మంత్రి నారా లోకేష్‌తో ఆసక్తికర చర్చ జరిపారు. రాబోయే ఏడాదిలో వైజాగ్‌లో తమ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామని రానా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ సమ్మిట్ వేదికగా ఒక చేదు నిజం మరోసారి బట్టబయలైంది. ఖండాంతరాల నుంచి వచ్చిన విదేశీ కంపెనీలు, క్రీడాకారులు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతుంటే, తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్న బడా నిర్మాతలు, అగ్ర హీరోలు మాత్రం ఈ సదస్సు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

రానా దగ్గుబాటి మినహా టాలీవుడ్‌కు చెందిన ఏ ఒక్క అగ్ర నిర్మాత గాని, స్టూడియో అధినేత గాని విశాఖ సమ్మిట్‌లో కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖలో సినిమా పరిశ్రమకు కావాల్సిన అద్భుతమైన ఎకోసిస్టమ్ నిర్మిస్తామని, సినీ పెద్దలు ముందుకు రావాలని మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆహ్వానించినా, ఇండస్ట్రీ దిగ్గజాల నుంచి కనీస స్పందన లేకపోవడం గమనార్హం. టాలీవుడ్ పెద్దల తీరుపై ఇప్పుడు ఏపీ సినీ అభిమానుల్లో, సామాన్యుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

తెలుగు సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. సినిమా విడుదలైన మొదటి రోజు బెనిఫిట్ షోల నుంచి టికెట్ ధరల పెంపు వరకు ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల వెసులుబాట్లు కావాలి. ఇక్కడి ప్రేక్షకుల అభిమానం కావాలి, ఇక్కడి మార్కెట్ నుంచి వందల కోట్ల కలెక్షన్లు కావాలి. కానీ, అదే ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టూడియో నిర్మించాలన్నా, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు పెట్టాలన్నా, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నా మాత్రం సినీ పెద్దలకు అస్సలు మనసు రావడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

విశాఖపట్నం ప్రకృతి అందాలకు, సినీ షూటింగ్‌లకు స్వర్గధామం లాంటిది. అక్కడ ఇప్పటికే రామానాయుడు స్టూడియో ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో సినిమా నిర్మాణం, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ వంటి పనులు జరగడం లేదు. కేవలం పాటలు, నాలుగు సన్నివేశాల షూటింగ్‌ల కోసమే వైజాగ్ వచ్చి, మిగతా వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోనే చక్కబెట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా, ఏపీలో సినీ పరిశ్రమ వేళ్లూనుకునేలా టాలీవుడ్ పెద్దలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం శోచనీయం. విదేశీయులు సైతం విశాఖ భవిష్యత్తును నమ్మి పెట్టుబడులు పెడుతున్న వేళ, మన తెలుగు సినీ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి ఏపీ గడ్డపై పరిశ్రమ విస్తరణకు ఎప్పుడు ముందుకు వస్తారో వేచి చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.