ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంట్ వేదికగా తన పట్టును పూర్తిగా కోల్పోయిందా..? దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో గానీ, రాష్ట్ర సమస్యలపై గళం విప్పడంలో గానీ వైసీపీ ఎంపీలు మునుపెన్నడూ లేనంతగా వెనకడుగు వేస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. లోక్‌సభలో కేవలం నలుగురు సభ్యులకే పరిమితమైన వైసీపీ.. కనీసం ఆ నలుగురితోనైనా గట్టి ఇంపాక్ట్ చూపించలేకపోవడానికి గల వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఓ లుక్ వేద్దాం.
కడప లోక్‌సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయంగా రక్షణ శైలిని అవలంబిస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న వివేకానంద రెడ్డి కేసు వ్యవహారం, పాత వివాదాలు, ఆయనను నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుల భయం కారణంగానే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలను ప్రశ్నించడం లేదా బహిరంగంగా ఎదురుతిరగడానికి ఏమాత్రం ధైర్యం చేయడం లేదని స్పష్టమవుతోంది. తన ఉనికిని కాపాడుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఢిల్లీలో ఏం చేయలేని పరిస్థితి.
రాజంపేట ఎంపీ, లోక్‌సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వ్యూహం కూడా పూర్తిగా మారిపోయింది. గతంలో కాస్తో కూస్తో ప్రభావం చూపిన ఆయన.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తమ కుటుంబంపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడానికే సరిపోతోంది. తనతో పాటు తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ భవిష్యత్తును, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుతం ఆయనకున్న ఏకైక అజెండాగా కనిపిస్తోంది. దీనివల్ల ఢిల్లీలో పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించాల్సిన మిథున్ రెడ్డి.. కేవలం ఆత్మరక్షణలోనే ఉండిపోయారు.
తిరుపతి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుండి గెలిచిన మద్దిల గురుమూర్తి క్షేత్రస్థాయి పోరాటాలకు దాదాపు దూరమయ్యారు. ఆయన ఢిల్లీ రాజకీయాల కంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేదా స్థానిక న్యాయస్థానాల చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల్లో పిటిషన్లు వేయడం, న్యాయపరమైన వివాదాలు నడపడం మినహా, కేంద్రంపై పొలిటికల్ ఒత్తిడి తెచ్చే ఎలాంటి ప్రజాపోరాటాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు.
అరకు ఎస్టీ నియోజకవర్గం నుండి అనూహ్యంగా ఎంపీగా ఎన్నికైన డాక్టర్ చెట్టి తనూజా రాణికి జాతీయ రాజకీయాలపై కనీస అవగాహన లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన ఆమెకు పార్లమెంటరీ పద్ధతులు, కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి నిధులు ఎలా రాబట్టాలి, ఢిల్లీలో ల్యాబీయింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై పట్టు లేదు. దీనివల్ల ఆమె నియోజకవర్గానికో లేదా కేవలం సభకు హాజరవడానికో పరిమితం అవుతున్నారు తప్ప.. గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.
మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీల పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు పెద్దల సభలో మంచి సంఖ్యాబలం ఉన్నప్పటికీ, వరుస రాజీనామాలు, పార్టీల మార్పులతో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. మిగిలి ఉన్న కొద్దిమంది రాజ్యసభ సభ్యులు కూడా భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టత లేక, జగన్ మోహన్ రెడ్డి పట్ల పూర్తి నమ్మకంతో ఉండలేక డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ క్షణంలో ఎవరు పార్టీ మారుతారో తెలియని గందరగోళం అక్కడ నెలకొంది. మొత్తానికి ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఒక నాయకత్వ లేమిని ఎదుర్కొంటోంది. ఒకరిని చూస్తే కేసుల భయం, మరొకరికి సొంత ఆస్తుల రక్షణ, ఇంకొకరికి అవగాహన లేమి.. ఇవన్నీ కలిసి వైసీపీని జాతీయ స్థాయిలో ఒక బలహీనమైన శక్తిగా మార్చేశాయి.














