ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ సమయంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు మేయర్ అభ్యర్థిత్వంపై ఒక ఆసక్తికరమైన అంతర్గత చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరు మేయర్ సీటును మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకు కేటాయిస్తామని సానుకూల హామీ ఇచ్చినట్లు గట్టిగా టాక్ నడుస్తోంది.
అయితే, ఈ పొలిటికల్ హామీ అంబటి కుటుంబానికి ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆర్థిక పరమైన సమీకరణాలు ఇప్పుడు వారికి పెద్ద తలనొప్పిగా మారాయని గుంటూరు రాజకీయా వర్గాల్లో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. రాజకీయ వర్గాల లీకుల ప్రకారం.. జగన్ మోహన్ రెడ్డి మేయర్ సీటు ఇస్తామని మౌనికకు భరోసా ఇచ్చారు కానీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలను మాత్రం పూర్తిగా ఆ కుటుంబానికే వదిలేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా కార్పొరేషన్ స్థాయి ఎన్నికల్లో, ముఖ్యంగా గుంటూరు లాంటి పెద్ద నగరంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే డివిజన్ల వారీగా అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పార్టీ పరంగా ఎలాంటి ఆర్థిక సహాయం అందే అవకాశం లేకపోవడంతో, ఒంటరిగానే ఈ భారీ ఎన్నికల ఖర్చును భరించడం ఎలా అనే దానిపై అంబటి అనుచరుల్లో అంతర్గత మథనం మొదలైంది. అంబటి రాంబాబు కుటుంబానికి ఈ ఆర్థిక భారం మరింత పెరగడానికి ఇటీవల కాలంలో వారు నిర్వహించిన రాజకీయ కార్యక్రమాలే ప్రధాన కారణమని టాక్. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపునిచ్చిన పలు నిరసన కార్యక్రమాలను అంబటి రాంబాబు గుంటూరు వేదికగానే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనలు గ్రాండ్ సక్సెస్ చేయాలనే పంతంతో భారీగా జన సమీకరణ చేయడం, వాహనాలు ఏర్పాటు చేయడం, ప్రచార ఖర్చులు తదితర వ్యవహారాలకు ఇప్పటికే అంబటి అహర్నిశలు శ్రమించి భారీగా సొంత నిధులు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ నిరసనల ఖర్చులతోనే ఇప్పటికే తడిసి మోపెడవ్వగా, ఇప్పుడు ఏకంగా నగర వ్యాప్తంగా సాగే మేయర్ ఎన్నికల ఖర్చు అంటే అది అంబటి కుటుంబానికి ఊహించని స్థాయి భారం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన ఆఫర్ను స్వీకరించి రిస్క్ చేయాలా, లేక ఆర్థిక సమీకరణాలు చూసుకుని వెనక్కి తగ్గాలా అనే సస్పెన్స్ ఇప్పుడు అంబటి క్యాంపులో నడుస్తోంది.












